చిల్లంగి పొలాల్లో సాగు చేసుకునేలా చేయండి..!

  • రెండేళ్లుగా పంట నష్టపోతున్న రైతులు
  • జిల్లా కలెక్టర్ ను కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం నియోజకవర్గం: పార్వతీపురం బైపాస్ రోడ్డు ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్ అవతల ఉన్న చిల్లంగి పొలాల్లో రైతులు సాగు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని జనసేన పార్టీ నాయకులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను కోరారు. సోమవారం ఆ పార్టీ జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్, కొల్లి వెంకటరమణ తదితరులు జిల్లా కలెక్టర్ ను కలిసి బైపాస్ రోడ్ రైల్వే ట్రాక్ ఆవల ఉన్న వరహాల గెడ్డ బాధిత చిల్లంగి పొలాలు రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పార్వతీపురం పట్టణ నడిబొడ్డున ప్రవహిస్తున్న వరహాల గెడ్డ పార్వతీపురం మున్సిపాలిటీ మురుగునీటినంతటిని తీసుకొని బైపాస్ రోడ్డు దాటి రైల్వే ట్రాక్ ఆవల ఉన్న కొర్ల చెరువులో కలిసి అక్కడ నుండి రాళ్లగెడ్డలో కలుస్తుందన్నారు. అయితే గత రెండేళ్ల క్రితం వరహాలగెడ్డ గట్టు రైల్వే ట్రాక్ దాటాక చిల్లంగి పొలం వద్ద గండి కొట్టిందన్నారు. దీంతో వరహాల గెడ్డలో ప్రవహిస్తున్న పార్వతీపురం చెత్తా, చెదారం, మురుగు, గాజు పెంకులు, గాజు సీసాలు ఆసుపత్రిలో ఉపయోగించిన సూదులు, చిరంజీలు, సారా బాటిల్స్, పాడైన పరుపులు, స్మశాన వాటికలో వాడే మంచాలు, కుండలు, పరుపులు తదితరవి పొలాల్లోకి కొట్టుకు వచ్చి సుమారుగా 50 ఎకరాల మేర చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. ఈ విషయమే గత రెండేళ్లుగా సంబంధిత ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. తక్షణమే గండిపడిన వరహాల గెడ్డ గట్టును పునరుద్ధరించాలని కోరారు. అలాగే గత రెండేళ్లుగా నష్టపోయిన పంటకు ఎకరాకు 30,000 రూపాయలు చొప్పున రైతులకు ఇవ్వాలని కోరారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినతిపత్రం అందించారు. దీనికి స్పందించిన కలెక్టర్ తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ కు వారు వినతిపత్రం అందజేశారు.