యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి

*ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
*భారతీయుల పురాతన సంపదైన యోగాను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి.. కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్

తిరుపతి, భారతీయుల ప్రాచీన సంపద అయిన యోగాను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమం కింద తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్. మౌర్య, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, కార్పొరేటర్లు నరసింహ ఆచారి జెండా ఊపి ప్రారంభించారు. కృష్ణాపురం ఠాణా నుండి నలుగుకాళ్ల మండపం వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జూన్ 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని తెలిపారు. రాష్ట్రం మొత్తం ఒక నెలపాటు యోగా ప్రాధాన్యతను తెలియజేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపకల్పన చేశామని, ఈ నెల 29 నుండి జూన్ 19 వరకు తిరుమల, శ్రీహరికోట, చంద్రగిరి, శ్రీకాళహస్తి, ఎస్వీ జూ పార్కుల్లో ప్రత్యేక యోగా శిబిరాలు నిర్వహిస్తామని చెప్పారు. జూన్ 10న తిరుమలలో 5 వేల మంది పాల్గొనే యోగా కార్యక్రమం ఉంటుందని, ప్రతి మండలానికి నలుగురు మాస్టర్ ట్రైనర్లు, వారు 200 మందికి శిక్షణ ఇవ్వడం ద్వారా సుమారు 10 లక్షల మందికి యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఒక భాగం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్రను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని, జూన్ 21న విశాఖపట్నంలో సుమారు ఐదు లక్షల మంది తో యోగా దినోత్సవం నిర్వహించనున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరి జీవితంలో యోగా భాగం కావాలని, మునిసిపల్, మండల, గ్రామస్థాయిలో జరిగే యోగాంధ్ర కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ యోగాంధ్ర ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసి అందరికీ యోగా పట్ల అవగాహన కల్పించేందుకు అనేక చర్యలు చేపట్టామని తెలిపారు. ఇందిరా మైదానం, వినాయక సాగర్ లలో ప్రతిరోజు ఉదయం యోగా శిక్షకులచే శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WhatsApp-Image-2025-05-27-at-6.33.23-PM-1024x683 యోగాంధ్రలో అందరూ భాగస్వాములు కావాలి

Share this content:

Post Comment