మాన్సాస్ ట్రస్ట్ ఈవో, స్టాఫ్ వివాదం: అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు

టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్ ట్రస్ట్ ఛైర్ పర్సన్ అశోక్ గజపతిరాజుపై విజయనగరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ట్రస్ట్ ఈవో వేతన ఖాతాలు నిలుపుదల చేయడం పట్ల జులై 17న విద్యా సంస్థల ఉద్యోగులు మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌ను కలిశారు.

అనంతరం ఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. జీతాలు ఎందుకు నిలిపివేశారంటూ ఈవోను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఈవో, ఉద్యోగుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించి.. కరోనా నిబంధనల ఉల్లంఘన, ఈవోపై దాడికి ప్రేరేపించారనే ఆరోపణలతో అశోక్ గజపతిరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ట్రస్ట్ చైర్మన్ అశోక్ తోపాటు కరస్పాండెంట్ సహా 10 మంది ఉద్యోగులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, ఉద్యోగులను, సిబ్బందిని రెచ్చగొట్టి ఈవోపై దాడికి ఉసిగొల్పారంటూ ఇటీవల మాన్సాస్ ట్రస్ట్ మాజీ చైర్ పర్సన్ సంచయిత గజపతిరాజు తీవ్రస్థాయిలో అశోక్ గజపతిరాజుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే.

‘అశోక్‌బాబాయ్‌ గారూ… మీ అన్నగారి పుట్టినరోజున ప్రభుత్వ ఉద్యోగి అయిన మాన్సాస్‌ ఈవోపైకి సిబ్బందిని రెచ్చగొట్టి పంపారు. ఆయన రక్షణ కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితి. ఇలాంటి చర్యలకు మీరు సిగ్గుపడ్డం లేదా?’ అంటూ ఘాటుగా విమర్శలు చేశారు సంచయిత గజపతిరాజు.

‘సిబ్బందిని తప్పుదోవ పట్టించి,వారిని రెచ్చగొట్టి ఈవో మీదకు పంపారు. మీ రాజకీయ చదరంగానికి మాన్సాస్‌ విద్యాసంస్థలను వాడు కోకండి. తాతగారు పీవీజీ రాజుగారు, నాన్నగారు ఆనందగజపతిగారు మాన్సాస్‌ సంస్థలను గొప్పగా తీర్చిదిద్దారు. ఆ వారసత్వాన్ని అశోక్ గజపతిరాజు గారు ధ్వంసం చేస్తున్నారు’ అని సోషల్ మీడియా వేదికగా సంచయిత తీవ్ర విమర్శలు చేశారు.