తెలంగాణలో 2 రోజుల పాటు గరిష్ఠ స్థాయికి ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌: తెలంగాణకు వడగాలుల ముప్పు పొంచి ఉంది. శుక్ర, శనివారాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భానుడి ప్రతాపంతో పాటు వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యంతో వేడి తీవ్రత మరింత పెరుగుతోంది. ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్‌ నగరం కూడా వేడెక్కుతోంది. 18 జిల్లాలను వడగాలుల తీవ్రత జాబితాలో విపత్తుల శాఖ చేర్చింది. కుమురంభీం ఆసిఫాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాలకు మరింత ముప్పు ఉందని, ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.