- ధ్యాన మార్గమే ఆరోగ్య రక్షణకు సన్మార్గమన్న వి.సి
నేటి రోజుల్లో ధ్యానం, వ్యాయామం అనేవి ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఎంతో భేషుగ్గా పని చేస్తాయని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ డి.వి.ఆర్ మూర్తి అన్నారు. స్థానిక ఆంధ్ర కేసరి యూనివర్శిటీ సమావేశపు హాలులో గురువారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) ఆద్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రదానోపాన్యాసం చేశారు. సమావేశానికి ఏ.కే.యూ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజ మోహన్ రావు అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా వి.సి ప్రొఫెసర్ మూర్తి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే సూత్రాన్ని ధనిక, పేద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ పాటించేందుకోసం తప్పకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలను అనుసరించ వలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇందులో భాగంగా సూర్యోదయాన్నే చేపట్టాల్సిన ధ్యానం, వ్యాయామం తదితర సన్మార్గాల గురించి ఆయన వివరించారు. వ్యాయామం, ధ్యానం అనేవి వయస్సుతో నిమిత్తం లేకుండా ఆరోగ్యాన్ని కాపాడు కునేందుకు ప్రతి ఒక్కరూ చేపట్ట వచ్చునని, ఈ ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పెంపొందించు కోవడం తోబాటు స్థూలకాయం, పలు రకాలైన వ్యాధులు వ్యక్తుల నుంచి దూరమవుతాయని ఆంధ్ర కేసరి యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బి హరిబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సలక్షణమైన ఆరోగ్యం కోసం ధ్యాన ముద్రలో తరించాల్సి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మరొక అతిథి, ఒంగోలు నగరం లోని ప్రసాద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చిన్నా,పెద్దా అనే తారతమ్యం లేకుండా ఆరోగ్య సూత్రాలను పాటించడం ద్వారా సుఖవంతమైన జీవితం పొందవచ్చునని అన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగా మాస్టర్లచే ఏటువంటి యోగాసనాలను చేపట్టినట్లయితే ఆరోగ్యాన్ని గణనీయంగా పెంపొందించు కోవచ్చునో ప్రయోగాత్మకంగా ఆసనాలు వేయించి సభికులను ఆనందింప జేశారు. ఏ.కే.యూ ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ దేవీ వర ప్రసాద్ మాట్లాడుతూ యోగా, వ్యాయామం అనేవి ఆరోగ్యాన్ని కాపాడు కోవడం కోసం ఉపయోగ పడతాయని, వీటిని పాఠశాల స్థాయి నుంచి వ్యాయామ ఉపాధ్యాయుల ఆద్వర్యంలో నేడు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఛాత్ర వ్యాయామోపాధ్యాయులు ఈ రెండు అంశాలను తమ శిక్షణలో పూర్తి స్థాయిలో అవగాహనను పెంపొందించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం సహాయ ఆచార్యుడు అడపాల వెంకటేశ్వర్లు వందన సమర్పణతో కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో బోధన, బోధనేతర సిబ్బంది ఏ.కే.యూ కళాశాలకు చెందిన విద్యార్థులు, పలువురు ధ్యానం మాస్టార్లు పాల్గొన్నారు.
Share this content:
Post Comment