టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబో సిద్ధమైందా?

కేజీఎఫ్ చిత్రంతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ 2 చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్.. సలార్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

త్వరలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అల్లు అర్జున్, ప్రభాస్‌లతో సినిమాలు చేయనున్నట్టు తెలుస్తుండగా, దసరాను పురస్కరించుకుని చిరంజీవి, రామ్‌చరణ్‌లను ప్రశాంత్‌ నీల్‌ కలిశారు. వారి కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. చిరంజీవిని కలవడంతో తన చిన్ననాటి కల తీరిందని ప్రశాంత్‌ నీల్‌ చెప్పుకొచ్చారు.

కాగా, ఈ సందర్భంగా ప్రశాంత్‌ చెప్పిన కథ నచ్చడంతో రామ్‌చరణ్‌ ఓకే చెప్పారని సమాచారం. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావడమే తరువాయి. కథానాయకుడి పాత్రను ఎలివేట్‌ చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్దడంలో ప్రశాంత్‌నీల్‌ది అందెవేసిన చేయి. ఆ టేకింగ్‌ ఎలా ఉంటుందో ‘కె.జి.యఫ్‌’లో చూశాం. మరి మెగా అభిమానులు ఊహించని స్థాయిలో ప్రశాంత్‌నీల్ కథా, కథానాలను తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌, ‘ఆర్‌ఆర్ఆర్‌’, ‘ఆచార్య’ చిత్రాల్లో నటిస్తున్నారు. దీని తర్వాత గౌతమ్‌ తిన్ననూరి సినిమా చేయనున్నారు. ఆ తర్వాతే ప్రశాంత్‌-చెర్రీల సినిమా పట్టాలెక్కుతుంది.