రేపటి నుంచి సింగరేణిలో మెగా వ్యాక్సినేషన్‌: సీఎండీ శ్రీధర్‌

సింగరేణి కార్మికులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసేందుకు రేపటి నుంచి సంస్థ ఆధ్వర్యంలో మెగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ఆ సంస్థ సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. పది రోజులపాటు కొనసాగనున్న వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో 29 వేల మందికి టీకాలు వేయాలని నిర్దేశించినట్లు ఆయన పేర్కొన్నారు. సింగరేణి దవాఖానలు, డిస్పెన్సరీలు, కమ్యూనిటీ హాళ్లలో సిబ్బందికి టీకాలు వేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ఇప్పటికే 16 వేల మంది కార్మికులకు తొలి డోసు టీకా ఇచ్చామని అన్నారు. కార్మికుల ఆరోగ్య సంరక్షణకు సింగరేణి సంస్థ అన్ని చర్యలు తీసుకుంటుందని సీఎండీ చెప్పారు.