పొలిటికల్ రీ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్‌..

వెండితెరపై నెంబర్‌ వన్‌ హీరోగా కొన్ని దశాబ్దాల పాటూ కొనసాగుతున్న మెగాస్టార్‌ చిరంజీవి.. మధ్యలో 10 సంవత్సరాలు సినిమాలకు దూరమైన విషయం తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ పెట్టి.. ప్రజలకు సేవ చేద్దామని వెళ్లిన చిరంజీవి.. ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేశారు. ఆ తర్వాత రాజకీయాలు మనకి పడవని తెలుసుకున్న చిరంజీవి తిరిగి మళ్లీ సినిమాలలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ‘ఖైదీ నెంబర్‌ 150’ చిత్రంతో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటే.. మళ్లీ రాజకీయాలలోకి వస్తున్నారని, ఆయనకు ఓ జాతీయ పార్టీ సీఎం పదవిని ఆఫర్‌ చేస్తుందనే వార్తలు ఈ మధ్య గట్టిగా వినిపిస్తూ వస్తున్నాయి. అయితే అలాంటి వార్తలన్నింటికీ తాజాగా ఆయన ఓ షోలో ఫుల్ స్టాప్ పెట్టేసారు.

అక్కినేని సమంత హోస్ట్‌గా ఆహా ఓటీటీలో నిర్వహిస్తోన్న ‘సామ్‌జామ్‌’ షోలో చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి పాల్గొన్న మెగా షోని ‘ఆహా’ ఓటీటీ క్రిస్మస్‌ కానుకగా ప్రసారం చేసింది. ఈ షో లో చిరు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లోకి వెళ్లి 10 సంవత్సరాలలో చాలా తెలుసుకున్నానని చెప్పారు. పాలిటిక్స్‌ తనకు సెట్ కావని అర్థమైందని తేల్చి చెప్పారు. నటుడిగా చాలా సంతోషంగా ఉన్నానని, ఇకపై రాజకీయాల జోలికి పోనని క్లారిటీ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా నటుడిగానే పుట్టాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం గురించి స్పందించిన చిరు.. పవన్ కష్టానికి సరైన ప్రతిఫలం దక్కుంతని, కచ్చితంగా విజయం సాధిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశారు. దీంతో గత కొన్నిరోజులుగా చిరు జాతీయ పార్టీలో చేరనున్నాడని జరుగుతోన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడినట్లైంది.