Araku: నకిలీ వస్తువులతో గిరిజనుల్ని దోచుకుంటున్న వ్యాపారులు

•డముకు వారంతపు సంతలో జనసేన నేతల తనిఖీలు

•అధికారులు చర్యలు తీసుకోవాలని వినతి

అరకు నియోజకవర్గ పరిధిలో జరిగే వారాంతపు సంతల సాక్షిగా గిరిపుత్రుల్ని వ్యాపారులు అడ్డంగా దోచుకుంటున్నారని జనసేన పార్టీ నాయకులు శ్రీ సాయిబాబ ఆరోపించారు. నకిలీ వస్తువులు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారనీ, గిరిజనులు పండించిన పంటలను మాత్రం కారు చౌకగా ఎత్తుకుపోతున్నారని తెలిపారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడడమే అందుకు కారణమన్నారు. డముకు బుధవారం సంతలో పార్టీ నాయకులు శ్రీ దూరియా సన్యాసిరావు, గెమ్మలతో కలసి పర్యటించారు. వ్యాపారస్తుల వద్ద ఉన్న వస్తువులను పరిశీలించారు. వ్యాపారులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజనుల్ని ఇష్టారాజ్యంగా దోచుకోవడం అలవాటుగా మారిపోయిందన్నారు. తూకంలో మోసాలు, నకిలీ వస్తువుల అమ్మకాలు యదేచ్చగా సాగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు శ్రీ పండు, శ్రీ జీవన్, శ్రీ రాజు తదితరులు పాల్గొన్నారు.