అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో నిర్వహించిన యోగా కార్యక్రమం గిన్నీస్ రికార్డు సాధించడంపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆనందం వ్యక్తం చేశారు. మే 21 నుంచి జూన్ 21 వరకు నెలరోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా “యోగాంధ్ర-2025” పేరుతో చేపట్టిన యోగా అభ్యాస కార్యక్రమాలు ప్రజలలో విస్తృత స్పందనను రాబట్టాయన్నారు. విశాఖ ఆర్‌కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షలాదిమంది ప్రజలు ఒకే వేదికపై యోగా చేయడం చారిత్రాత్మక ఘట్టమని, ఇది రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిందని అన్నారు. యోగా మన భారతీయ సంస్కృతిలో భాగమైన గొప్ప సంపదగా, ప్రతి ఒక్కరి జీవనశైలిలో భాగంగా మారాలని ఆయన ఆకాంక్షించారు. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరుల నేతృత్వంలో యోగా వేడుకల్లో పాల్గొనడం తనకు గర్వకారణమని మంత్రి తెలిపారు.
ఈ విజయం సాధించడంలో సహకరించిన అధికార యంత్రాంగానికి, ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Share this content:
Post Comment