నెల్లూరు జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితులపై మంగళవారం అసెంబ్లీలోని మంత్రి ఛాంబర్‌లో ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రస్తుత పరిస్థితి, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించుకున్నారు. మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, ఇప్పటివరకు 15,000 టన్నులకుపైగా ధాన్యం కొనుగోలు పూర్తయ్యిందని, రైతులు ఆందోళన చెందవద్దని, ప్రతి గింజను కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం కొనుగోలు జరిగిన 24 గంటల్లోపే నగదు రైతుల ఖాతాల్లో జమ అవుతుందని, రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు కొనసాగుతుందని తెలిపారు. గన్ని బ్యాగులు, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యాలను అందుబాటులో ఉంచామన్నారు. మిల్లర్లతో చర్చించి కొనుగోళ్లు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తేమ శాతం 17-20 ఉన్న ధాన్యాన్ని కూడా రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ధాన్యం అమ్మకం మరింత సులభతరం చేసేందుకు 7337359375 నెంబర్‌కు “Hi” మెసేజ్ పంపితే వివరాలు తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి పి. నారాయణ, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మహమ్మద్ ఫరూక్, ఎంఎల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, కే. రామకృష్ణ, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, పౌర సరఫరాల సంస్థ ఎండీ మన్ వీర్ జిలాని తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment