ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో నేడు మంత్రి సబితా భేటీ

కరోనా లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో వచ్చే నెల 1 నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా స్కూళ్లు, కాలేజీల పునఃప్రారంభంపై చర్చించనున్నారు. విధివిధానాలు, ఫీజులపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అదేవిధంగా ఇంటర్‌, డిగ్రీ, పీజీ కాలేజీల్లో ప్రత్యక్ష బోధన అంశంపై కూడా చర్చించనున్నారు.

పేపర్‌ప్లేట్లలో మధ్యాహ్న భోజనం!

జూలై 1న విద్యాసంస్థలు తెరుచుకోనుండగా.. తొలిరోజు నుంచే హాజరైన విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనాన్ని అందజేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, ఎయిడెడ్‌, నేషనల్‌ చైల్డ్‌ లేబర్‌ ప్రొటెక్షన్‌ పథకం, మదర్సాలు కలిపి మొత్తం 27,406 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలుచేస్తున్నారు. సుమారు 22 లక్షల మంది విద్యార్థులు పథకం ద్వారా గతంలో లబ్ధిపొందారు. ఇప్పటికే 2,800 మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం స్కూళ్లలో ఉన్నట్టు అధికారులు తేల్చారు. ఈ నిల్వలు 15 రోజులకు సరిపోతాయని, ఆ తర్వాతే కొత్త బియ్యం పంపిణీచేయాలని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు పేపర్‌ప్లేట్లు, డిస్పోజబుల్‌ గ్లాసులను వినియోగించాలని యోచిస్తున్నారు.