ఎట్టకేలకు చిన్నారి కుటుంబాన్ని కలిసిన మంత్రులు..!

సైదాబాద్ బాలిక విషయంలో ప్రభుత్వ తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. అసలు.. హోంమంత్రి ఉన్నారా..? లేరా..? అనే ప్రశ్నను లేవనెత్తాయి ప్రతిపక్షాలు. సోషల్ మీడియాలో అయితే టీఆర్ఎస్ సర్కార్ ని ఓ ఆటాడుకుంటున్నారు నెటిజన్స్. ఇటు ప్రజల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు మంత్రులు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ చిన్నారి కుటుంబాన్ని కలిశారు. తీరని దుఃఖంలో ఉన్న తల్లిదండ్రులను ఓదార్చారు. రూ.20 లక్షల చెక్కును అందజేశారు. నిందితుడు రాజుని పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. అయితే రాజును పట్టుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మంత్రులు సింగరేణి కాలనీకి రావడంతో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

గట్టి బందోబస్తుతో వచ్చిన మంత్రులకు నిరసన సెగ తప్పలేదు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనకు దిగారు. హోంమంత్రి కాన్వాయ్ ను సేవాలాల్ బంజారా సంఘం నేత అడ్డుకున్నారు.