మంత్రులు, ఎమ్మెల్యేలు, కమీషనర్లు పేరుకుపోయిన చెత్తను తొలగించాలి

గుంటూరు, మున్సిపల్ కార్మికుల సమ్మెతో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోవటంతో నగరం మొత్తం దుర్గంధమయంగా మారిందని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. స్థానిక 22 వ డివిజన్ పరిధిలోని శ్రీనివాసరావుతోటలోని 60 అడుగుల రోడ్డులో డంబర్ బిన్ లు నిండి రోడ్డు మీదకు చెత్త రావటంతో ప్రజలు ఎదురుకుంటున్న ఇబ్బందులపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన అసమర్ధ పాలనతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి రాష్ట్రాన్ని చెత్తాంద్రప్రదేశ్ గా మార్చారని దుయ్యబట్టారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని, అసెంబ్లీ సాక్షిగా జగన్ తమకి ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నారన్నారు. మాట్లాడితే తనని తాను పేదల పక్షపాతిగా చిత్రీకరించుకునే ముఖ్యమంత్రికి పారిశుద్ధ్య కార్మికుల జీతాలు పెంచటానికి ఎందుకు చేతులు రావటం లేదంటూ ధ్వజమెత్తారు. పారిశుద్ధ్య కార్మికుల కష్టం తెలియాలి అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, కమీషనర్ లు ఒక గంట సేపు పేరుకుపోయిన చెత్తను తొలగించాలని వ్యాఖ్యానించారు. ఏసీ కార్లలో తిరుగుతా ఉంటే పారిశుద్ధ్య కార్మికుల వేదన ఎలా తెలుస్తుందన్నారు. కార్మికులు ఎలాంటి అపరిశుభ్ర వాతావరణంలో, ఎటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారో అధికారులకు, పాలకులు కూడా తెలుస్తుందన్నారు. ఒక్క నిముషానికే దుర్గంధంతో ముక్కులు పగిలిపోతుంటే ప్రతినిత్యం కార్మికులు ఎలా విధులు నిర్వహిస్తున్నారో అంటూ వేదన చెందారు. కార్మికుల సమస్యను ప్రభుత్వం వీలున్నంత త్వరగా పరిష్కరించకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుందన్నారు. ప్రజలకు ఎలాంటి అనారోగ్యం సోకినా దానికి పూర్తి బాధ్యత పాలకులే వహించాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కార్మికులు తమ డిమాండ్ల కోసం పోరాడుతుంటే నగర కమీషనర్ దొంగ వర్కర్లతో రాత్రులు పనులు చేయించాలని చూడటం దుర్మార్గమన్నారు. కార్మికుల కష్టాన్ని, బాధల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అధికారులు దొంగ దారులు వెతకడం హేయమన్నారు. సమస్య పరిష్కారం అయ్యేవరకు కార్మికులకు అండగా జనసేన టీడీపీ ఉంటాయని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో టీడీపీ డివిజన్ అధ్యక్షుడు షేక్ నాగూర్ వలి, జనసేన, టీడీపీ నేతలు మెహబూబ్ బాషా, అలా కాసులు, నైజామ్ బాబు, జిలాని, కరీం, బియ్యం శ్రీను, విమల్, అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.