చిన్నచిన్న గొడవలు బంధాలను బలోపేతం చేస్తాయి: ఉపాసన

వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య విభేదాలు రావడం సర్వసాధారణమని సినీ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన అన్నారు. తనకు, చరణ్ కు మధ్య కూడా అప్పుడప్పుడు గొడవలు వస్తుంటాయని చెప్పారు. ఎనిమిదేళ్ల తమ వైవాహిక బంధం అద్భుతంగా గడిచిందని అన్నారు. తమ మధ్య ఎన్నో అపురూపమైన జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పారు. అందరు భార్యాభర్తల మాదిరే తమ మధ్య కూడా అప్పుడప్పుడు విభేదాలు, గొడవలు కూడా వస్తుంటాయని అన్నారు.

భార్యాభర్తల మధ్య చిన్నచిన్న గొడవలు జరిగితేనే వారి మధ్య బంధం మరింత బలపడుతుందని ఉపాసన చెప్పారు. తమ మధ్య తలెత్తే సమస్యలను ఇద్దరం కలిసి ఎదుర్కొంటూ, సంతోషంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. తమ పెళ్లి జరిగిన తర్వాత మొదటి వాలంటైన్స్ డే సందర్భంగా చరణ్ తనకు అపురూపమైన కానుక ఇచ్చారని… హార్ట్ షేప్ లో ఉన్న చెవి రింగులను తయారు చేయించి ఇచ్చారని… ఆ కానుక తనకు ప్రత్యేకమైనదని చెప్పారు.