రోజుకో అత్యాచారం.. కౌలు రైతుల ఆత్మహత్యలు జగన్ పాలనలో రాష్ట్ర దుస్థితికి అద్దం పడుతున్నాయి

• రాజకీయ లబ్దే లక్ష్యంగా యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు
• వైసీపీ మనుగడ కోసం నిత్యం ప్రజల దృష్టిని మళ్లించి మభ్యపెడుతున్నారు
• ప్రతి సమస్యని రాజకీయ కోణంలో చూస్తున్నారు
• ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే కౌలు రైతుల ఆత్మహత్యలు
• వైసీపీ అధికారంలోకి వచ్చాక 3 వేల మంది కౌలు రైతులు బలవన్మరణానికి పాల్పడ్డారు
• ఆర్థికంగా చితికిపోయిన ఆ కుటుంబాలలో భరోసా నింపేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటన
• 8వ తేదీ కర్నూలు జిల్లాలో 130 మంది రైతులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం
• రూ. లక్ష సాయం చేసి సభకు వెళ్లొద్దని చెబుతోంది
• ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే రూ. 7 లక్షలు ఇవ్వాలి
• వైసీపీ వాళ్ళు గడపగడపకు వెళ్ళే పరిస్థితి లేదు
• కర్నూలులో మీడియా సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రోజుకో అత్యాచారం.. ఇద్దరు కౌలు రైతుల ఆత్మహత్యలు.. ఇవీ శ్రీ జగన్ రెడ్డి పాలనలో రాష్ట్ర దుస్థితి అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. ముఖ్యమంత్రికి పరిపాలనా దక్షతతోపాటు పాలన మీద ఆసక్తి, చొరవ కూడా కరవయ్యాయన్నారు. అందువల్లే రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే వారిని ఆదుకోవాల్సిందిపోయి వారికి భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలకు పరిమితం అవుతుండడం దారుణమన్నారు. ఈ నెల 8వ తేదీ ఆత్మహత్యలకు పాల్పడిన 130 మంది కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నింపేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నట్టు తెలిపారు. రెండున్నరేళ్ల నుంచి ఆ కుటుంబాలను పట్టించుకోని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి పర్యటన అనగానే ఇప్పుడు తూతూ మంత్రంగా 300 మందికి రూ.లక్ష చొప్పున ఖాతాల్లో జమచేసి మభ్యపెట్టే ప్రయత్నాలు మొదలు పెట్టారన్నారు. శుక్రవారం మధ్యాహ్నం కర్నూలులో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “శ్రీ జగన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలనలో పూర్తి స్థాయిలో విఫలమైంది. ఈ ముఖ్యమంత్రి ఏ మాత్రం పరిపాలనా దక్షత లేని వ్యక్తి. రాజకీయ లబ్ధి లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని కేవలం అతని కుటుంబం కోసం, ఆస్తులు కాపాడుకోవడం కోసం, వైసీపీ మనుగడ కోసం దృష్టి మళ్లించి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టిన ఘనత శ్రీ జగన్ రెడ్డికి దక్కుతుంది. శ్రీ పవన్ కళ్యాణ్ గారు గత మూడేళ్లుగా ప్రభుత్వంపై ఎలాంటి వ్యక్తిగత విమర్శలకు దిగింది లేదు. రాష్ట్ర ప్రజానీకానికి మన వంతు చేయగలిగిన సహాయం చేద్దామన్న ఉద్దేశ్యంతో ఏ సమస్యపైనైనా క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకుని, వివరాలు సేకరించిన తర్వాతే పత్రికా సమావేశాలు, బహిరంగ సభల ద్వారా పోరాటం చేస్తోంది. అలాగైనా ప్రభుత్వం నుంచి స్పందన వస్తుందన్న ఉద్దేశంతో జనసేన పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు చేపడుతోంది. అందులో భాగంగానే రెండు జిల్లాల్లో అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా నింపడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ప్రభుత్వ పాలనలో ఆదరణ కరవై సంవత్సరాల తరబడి వారు పడుతున్న ఇబ్బందుల గురించి యంత్రాంగం నుంచి స్పందన రాని పరిస్థితుల్లో మానసిక క్షోభకు గురై రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆ కుటుంబానికి పార్టీ తరఫున కొంత వరకైనా అండగా నిలబడే విధంగా జనసేన పార్టీ ఓ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో రైతులుకు జరిగిన అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటించి కొంత మంది రైతుల ఇంటింటికీ వెళ్లి అండగా నిలిచారు. 8వ తేదీ ఆళ్లగడ్డ నియోజకవర్గం, శిరివెళ్ల మండలంలో పర్యటించి రచ్చబండ కార్యక్రమం ద్వారా 130 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందచేస్తారు.
• కర్నూలు జిల్లాలోనే 400 మంది కౌలు రైతుల ఆత్మహత్య
ఈ ప్రభుత్వం రైతులు ఏ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు కౌలు రైతులను గుర్తించడం లేదన్న విషయం అర్థం కావడం లేదు. 2019లో శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గతంలో ఉన్న కౌలుదారు చట్టాన్ని విస్మరించి కొత్త చట్టాన్ని తీసుకువచ్చారు. భూమిపై హక్కు ఉన్న యజమాని సంతకం పెడితే మినహా వ్యవసాయ శాఖ నుంచి అందాల్సిన భరోసాగాని, రావాల్సిన వనరులుగాని సామాన్య కుటుంబాలకు చేరడం లేదు. రైతులకు కులాలు అంటగట్టి రైతు భరోసా అందిస్తోంది. ఏ కులానికి చెందిన రైతు అని తెలుసుకుని వారికి మాత్రమే సాయం అందించడం మొదలుపెట్టారు. శ్రీ జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క కర్నూలు జిల్లాలోనే 400 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేపు కార్యక్రమం చేపట్టనున్న ఒక్క ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనే 50 మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా రైతు స్వరాజ్యం వేదిక అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి సమాచారం తెప్పిచుకుంటే ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది రైతు ప్రభుత్వం.. రైతుల కోసం వచ్చిన ప్రభుత్వం.. మా తండ్రి గారిలా నేను బ్రహ్మాండంగా పాలిస్తాను అని చెప్పి నమ్మించిన ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పరిపాలనలోనే 3 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడడానికి మించిన దారుణం ఏముంది. అధికారం మీద పట్టులేకపోవడమే అందుకు కారణం. రాజకీయ వ్యవస్థ కోసం ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరుగుతున్నాయి
• ఇన్ని రోజులూ ఆ కుటుంబాల్ని పట్టించుకున్న నాథుడు లేడు
ఆత్మహత్యకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలు గత రెండున్నరేళ్లుగా తొక్కని గడప లేదు. కాగితాలు పట్టుకుని కలవని అధికారి లేడు. ఇన్ని రోజుల నుంచి ఎవరూ పట్టించుకోలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనగానే ఇప్పుడు హడావిడిగా 300 మందికి రూలక్ష ఇచ్చారు. మీలో చిత్తశుద్ధి ఉంటే 43, 102 జీవోల ప్రకారం 15 రోజుల్లోపు స్పందించి రూ.7 లక్షల పరిహారం చెల్లించండి. అధికారులను పంపి వన్ టైమ్ సెటిల్మెంట్ చేయించండి. ఇన్నాళ్లు ఆ పని ఎందుకు చేయలేదు. ఇప్పుడు తూతూ మంత్రంగా రూ.లక్ష వారి ఖాతాల్లో వేసేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీటింగుకి వెళ్లొద్దని బెదిరిస్తున్నారు. బాధ్యతగల రాజకీయ పార్టీగా సమాజంలో చితికిపోయిన కుటుంబాలకు అండగా నిలవాలన్న ఉద్దేశంతో ఆయన సొంత డబ్బు రూ.5 కోట్లు విరాళం ఇచ్చి ఆ కుటుంబాల్లో భరోసా నింపుదామని చూస్తుంటే.. మీరు దాన్ని కేవలం రాజకీయ కోణంలో చూసి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కాబట్టి హడావిడిగా రూ.లక్ష వారి ఖాతాల్లో వేయడం అన్యాయం. రూ.లక్షే ఎందుకు వేస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి వివరాలు ఎందుకు కప్పిపుచ్చారు. ఇన్ని రోజుల నుంచి మీ వాలంటీర్ వ్యవస్థ, మీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఏమయ్యారు. కర్నూలు జిల్లాలోనే ఇంత మంది ఆత్మహత్య చేసుకుంటే ఎంత దయనీయ పరిస్థితి ఉందో అర్ధం చేసుకోవాలి. మీలో నిజాయితీ, చిత్తశుద్ధి లేదు. ఇప్పుడు రూ.లక్ష ఇచ్చి తర్వాత రూ.7 లక్షలు ఇస్తామని వారిని మభ్యపెట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సభకు వెళ్లొద్దని మాట్లాడుతున్నారు.
• శ్రీ జగన్ రెడ్డి పాలనను పక్క రాష్ట్రాల నాయకులు విమర్శిస్తున్న దుస్థితి
బాధ్యతగల ప్రతిపక్ష పార్టీగా ప్రతి రైతును ఆదుకోవడానికి ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదలు పెట్టినప్పుడు వెయ్యి మంది చనిపోయారు అనుకున్నాము. లెక్కలు చూస్తే శ్రీ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 1019 మంది, రెండో ఏడాది 890 మంది, ఈ ఏడాది ఆ సంఖ్య వెయ్యి ఎప్పుడో దాటేసింది. ఈ కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పందన లేని పరిస్థితుల్లో వారానికి ఇద్దరు ముగ్గరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టేశారు. వైసీపీ పాలనలో ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఇంకా చాలా మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం వస్తోంది. వారందరికీ భరోసా నింపేందుకే శ్రీ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఎవరూ బెదిరింపులకు భయపడవద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం నిలబడుతున్నారు. వారి కోసం జిల్లాలవారీగా ప్రత్యేక ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. బాధ్యతగల ప్రభుత్వంగా జనసేన పార్టీ మీద విమర్శలు మాని మా పార్టీ చేస్తున్న కార్యక్రమాలు చేయగలరా ఆలోచించుకోండి. ముఖ్యమంత్రి గడప గడపకు వెళ్లమన్నారు. మీకు ఆ పరిస్థితి ఉందా? మీ ఎమ్మెల్యేలు వస్తే నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రోడ్ల దుస్థితి మీద జనసేన పార్టీ నిర్వహించిన క్యాంపెయిన్ తోనే అందరికీ రాష్ట్రంలో పరిస్థితులు తెలిశాయి. పక్క రాష్ట్రాల నాయకులు విమర్శిస్తున్నారంటే అంతకంటే దుస్థితి ఏముంది. ఈ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలకే పరిమితం అవుతున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వాడే భాష, మాట్లాడాల్సిన మాటలా అవి. ప్రతి పక్ష పార్టీగా బాధ్యత ఉంది కాబట్టే ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకునే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం” అన్నారు. మీడియా సమావేశంలో పార్టీ కార్యక్రమాల విభాగం కన్వీనర్ కళ్యాణం శివశ్రీనివాస్, పార్టీ నాయకులు చింతా సురేష్, శ్రీమతి రేఖా గౌడ్, శ్రీమతి హసీనా బేగం, బాలవెంకట్, వై.విశ్వనాథ్, లక్ష్మన్న, అర్షద్ తదితరులు పాల్గొన్నారు.