గూడూరు జడ్పీ పాఠశాలలో నాబార్డ్ నిధుల దుర్వినియోగం: ఎస్ వి బాబు

పెడన, భారతం తెలిసిన ప్రతి ఒక్కరికి మయసభ గురించి తెలిసి ఉంటుంది. ఈ మయసభలో లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు కనిపిస్తుంటాయి. ఇది చరిత్ర. కానీ నిజ జీవితంలో గూడూరు మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో వైసిపి నాయకుడు (ప్రస్తుతం కాంట్రాక్టర్ అవతారమెత్తిన వ్యక్తి) కూడా మరో మయసభను నిర్మించారు. విషయంలోకి వెళ్తే 2020 నాబార్డ్ నిధులు 72 లక్షల 80 వేల రూపాయలు పాఠశాల మరమ్మత్తులు, గ్రౌండ్ ఫ్లోర్, మొదటి అంతస్తులో రెండేసి అదనపు గదుల నిర్మించేందుకు అనుమతులు ఇచ్చి నిధులు మంజూరు చేశారు. కానీ వాస్తవానికి పాఠశాలలో ఎలాంటి నిర్మాణాలు, మరమ్మతులు జరగలేదు. పేరెంట్స్ విద్యా కమిటీ చైర్మన్ సంతకాన్ని ఫోర్జరీ చేసి సదరు కాంట్రాక్టర్ అధికారులతో కుమ్మక్కై చెయ్యని పనులను చేసినట్లు చూపిస్తూ బిల్లులను పొందాడు. ఈ విషయాన్ని గూడూరు మండల అధికార పార్టీ నాయకులే మీడియా సమక్షంలో తెలియజేశారు. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవటం లేదని, ఈ విషయం మంత్రి జోగి రమేష్ కూడా తెలుసు అని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇంత జరిగినా మంత్రి మౌనవహిస్తున్నారంటే ఈ అవినీతిలో మంత్రి వాటా ఎంత? గూడూరు మండల వైసీపీ నాయకుల ఆగడాలకు హద్దు లేదు. మంత్రి జోగి రమేష్ అండతో అక్రమ మట్టి దందా మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగుతుంది. అది చాలదు అన్నట్లు వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లు అవతారమెత్తి ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంపై మంత్రి జోగు రమేష్ వివరణ ఇవ్వాల్సిందిగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షాన మీ మద్దతుతోనే మీ పార్టీ నాయకులు అవినీతికి పాల్పడుతున్నట్లు నిర్ధారించవలసి వస్తుంది. ఈ విషయంపై గౌరవ కలెక్టర్ స్పందించి సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయవలసిందిగా జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. త్వరలోనే జిల్లా కలెక్టర్ ని కలిసి ఈ విషయంపై జనసేన పార్టీ వినతిపత్రం అందజేస్తుందని పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు అన్నారు.