అసెంబ్లీలో తిరుపతి సమస్యలపై గళమెత్తిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు

తిరుపతి: పెరుగుతున్న జనాభా దృష్ట్యా తిరుపతిలో ప్రభుత్వ ఇంటర్, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేయాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బుధవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. టిటిడి ఆధ్వర్యంలో ఉన్న కాలేజీలు మినహా ప్రభుత్వానికి చెందిన కాలేజీలు లేవని ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. శెట్టిపల్లి భూముల సమస్యపై ప్రస్తావన..ముప్పయి ఏళ్లుగా పరిష్కారం కాకుండా ఉన్న శెట్టిపల్లి భూముల సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు గతంలో శెట్టిపల్లి గ్రామాన్ని సందర్శించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. తుడా పరిధిలో శెట్టిపల్లి గ్రామాన్ని చేర్చాలని డిమాండ్.. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఈ సమస్య పరిష్కారం కాకపోగా, శెట్టిపల్లి గ్రామాన్ని మున్సిపాలిటీ పరిధిలోకి కలిపారని ఆయన ఆక్షేపించారు. మున్సిపాలిటీలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని పేర్కొంటూ, శెట్టిపల్లిని తిరిగి మున్సిపాలిటీ నుంచి తొలగించి తుడా పరిధిలో చేర్చాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. డ్రైనేజీ సమస్యపై ఆందోళన..తిరుపతి నగరంలో 30 ఏళ్ల కిందట నిర్మించిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా పాతబడిపోయిందని, పెరిగిన జనాభా దృష్ట్యా కొత్త డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు. పాత డ్రైనేజీ కారణంగా నగర ప్రజలు రోజూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, నగర అభివృద్ధికి తక్షణమే నిధులు కేటాయించి కొత్త అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Share this content:

Post Comment