కోవిడ్‌–19 పరీక్ష, చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణకు జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఎమ్మెల్యే పద్మావతి

 కోవిడ్‌–19 పరీక్ష, చికిత్స విషయంలో నూతన ఆవిష్కరణలపై జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ (ఎన్‌ఆర్డీసీ) నిర్వహించిన పోటీలో ఆంధ్రప్రదేశ్‌ నుంచి రెండు ఆవిష్కరణలకు జాతీయస్థాయి గుర్తింపు లభించింది. అనంతపురంలోని శ్రీనివాస రామానుజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎస్‌ఆర్‌ఐటీ), ఏలూరులోని రామచంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ ఈ ఘనత సాధించాయి. ఎస్‌ఆర్‌ఐటీ ఆవిష్కరణ శింగనమల వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో రూపొందించినది కావడం విశేషం. ఓ ఎమ్మెల్యే ఇలాంటి ఆవిష్కరణ చేయడం దేశ చరిత్రలోనే మొట్టమొదటిది. దేశ వ్యాప్తంగా జరిగిన పోటీకి వేలాది దరఖాస్తులురాగా 16 ఆవిష్కరణలను విజేతలుగా ప్రకటించారు. ఎన్‌ఆర్‌డీసీ సీఎండీ హెచ్‌.పురుషోత్తం గురువారం విజేతలను ప్రకటించారు.


ఆవిష్కరణలోని ముఖ్య అంశాలు:

ఎంటెక్‌ చదివిన ఎమ్మెల్యే పద్మావతి.. వైద్య సిబ్బందికి కరోనా సోకకుండా ఉండే క్యాబిన్‌ రూపొందించారు.

ఎలాంటి రక్షణ కవచాలు లేకపోయినా డాక్టర్లు క్యాబిన్‌లోకి ప్రవేశించిన తర్వాత సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. వైరస్‌ చొరబడటానికి అవకాశం లేకుండా ఆ క్యాబిన్‌ ఉంటుంది.

 పారదర్శకంగా ఉండి కదిలే ఈ క్యాబిన్‌ నుంచే వారు రోగులకు సేవలు అందించవచ్చు. వార్డుల్లో క్యాబిన్‌తో పాటు స్వేచ్ఛగా తిరగవచ్చు.

 డాక్టర్‌ క్యాబిన్‌ నుంచి బయటకు వచ్చాక అది ఆటోమేటిగ్గా శానిటైజ్‌ అవుతుంది. తరువాత వేరొకరు ఆ క్యాబిన్‌ ద్వారా సేవలందించవచ్చు.