‘శాకుంతలం’లో మోహన్ బాబు కీలక పాత్ర?

‘రుద్రమదేవి’ వంటి చారిత్రాత్మక కథా చిత్రాన్ని రూపొందించి ప్రశంసలందుకున్న ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఇప్పుడు ‘శాకుంతలం’ పేరిట పౌరాణిక కథను తెరకెక్కిస్తున్న సంగతి విదితమే. మహాభారతం, ఆదిపర్వంలోని ప్రేమకథ ఆధారంగా  రూపొందుతున్న ఈ చిత్రంలో అందాల కథానాయిక సమంత శకుంతలగా నటిస్తుండగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించారు. ఇక ఇందులో మరో కీలక పాత్రను ప్రముఖ నటుడు మోహన్ బాబు పోషించనున్నట్టు తెలుస్తోంది. కథలో కీలకమైన దూర్వాస మహాముని పాత్రను ఆయన పోషించనున్నారని అంటున్నారు. ఈ విషయంలో ప్రస్తుతం ఆయనతో చిత్ర బృందం చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. ఒకవేళ మోహన్ బాబు నటించడం అన్నది ఖరారైతే కనుక ఈ ప్రాజక్టుకి మరింత క్రేజ్ వస్తుందనే చెప్పచ్చు. మణిశర్మ దీనికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం భారీ సెట్స్ ను వేస్తున్నారు.