సొమ్ము ప్రజలది… పని పార్టీది!

* వాలంటీర్లను వాడుకుంటున్న వైకాపా
* జీతాలకు ఇస్తున్నది ప్రజల సొమ్ము
* చేయించుకుంటున్నది పార్టీ పని
* జగన్‌ ప్రభుత్వ అడ్డగోలు విధానాలు

ఓ రాజకీయ పార్టీ ఎన్నికల్లో గెలవాలనుకోవడం తప్పు కాదు…
అందుకోసం కార్యకర్తలను ఉపయోగించుకోవడం తప్పు కాదు…
ఊరూ వాడా ప్రచారం చేసుకోవడం తప్పు కాదు…
కానీ…
ప్రభుత్వం ద్వారా జీతాలు అందుకునే వారిని పార్టీ పనులకు ఉపయోగించుకోవడం మాత్రం ముమ్మాటికీ తప్పే!
పార్టీ ప్రచార పనుల కోసం జీతగాళ్లను వాడుకోవడం కూడా నూటికి నూరు శాతం తప్పే!!
ఎందుకంటే…
ప్రభుత్వ ఖజానా ద్వారా జీతాలుగా ఇచ్చే డబ్బు ప్రజలది!
ప్రజల అవసరాల కోసమే ఉద్యోగులు పని చేయాలి!
అంతేకానీ…
ప్రజలు పన్నుల ద్వారా సమకూర్చే ఆదాయాన్ని జీతాలుగా ఇస్తూ…
అలా జీతాలు అందుకుంటున్న వారిని సొంత పార్టీ పనులకు ఉపయోగిస్తే?
అది కచ్చితంగా అప్రజాస్వామికం!
అది నిక్కచ్చిగా అధికార దుర్వినియోగం!
అయితే ఇప్పుడు ఏపీలో జరుగుతున్నది ఇదే…
అధికార వైకాపా నిర్లజ్జగా పాటిస్తున్న విధానం ఇదే…
జగన్‌ ప్రభుత్వం బహిరంగంగానే వ్యవహరిస్తున్న తీరు ఇదే…
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇస్తూ…
అధికారం ఉంటే ఏమైనా చేయవచ్చనే తెంపరితనాన్నిప్రదర్శిస్తూ…
అడ్డగోలుగా ఏం చేసినా అడిగేదెవరనే దురహంకారాన్ని ప్రకటిస్తూ…
ఏపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందనడానికి వాలంటీర్లను వాడుకుంటున్న వైఖరే ప్రత్యక్ష నిదర్శనం!
ఇదేమీ లోపాయికారీగా జరుగుతున్న వ్యవహారం కాదు.
సభలు పెట్టి, సమావేశాలు ఏర్పాటు చేసి…
వాలంటీర్లందరూ రావాలని ఆదేశించి…
రాని వాళ్లపై బెదిరింపు చర్యలకు పాల్పడుతూ…
స్వయానా వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు సాగిస్తున్న బహిరంగ భాగోతం!
* పూర్వాపరాలివీ…
ఒకటి కాదు… రెండు కాదు… ఏకంగా రూ.1909 కోట్లు!
ఇన్ని కోట్లను వైకాపా ప్రభుత్వం వాలంటీర్ల జీతభత్యాల కోసం వెచ్చిస్తోంది.
వైకాపా అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ప్రతి 50 ఇళ్లకు ఒకరి వంతున సుమారు 2.6 లక్షల మంది వాలంటీర్లను నియమించింది. వీళ్లందరికీ గౌరవ వేతనాలుగా ఖజానా సొమ్మును వెచ్చిస్తోంది. వాలంటీర్లకు ఏటా రూ.1506 కోట్లను జీతాలుగా చెల్లిస్తోంది. జీతం కాకుండా వారి సెల్‌ ఫోన్‌ బిల్లులు, సాక్షి పేపర్ బిల్లులు, పురస్కారాలు, సత్కారాల పేరిట మరో రూ.343 కోట్లు ఖర్చు చేస్తోంది. అంటే అన్నీ కలిపితే రూ. 1909 కోట్లు.
ఇంత మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత తమదేనంటూ ప్రచారం చేసుకుంది. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించామంటూ ఊదరగొట్టింది. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా వాలంటీర్లతో చెప్పుకుంటే చాలని, వారి ద్వారా ఆయా సమస్యల పరిష్కారానికి పాటు పడతామని ప్రకటనలు చేసింది. ఇదంతా అధికార వికేంద్రీకరణలో భాగమంటూ గొప్పలు చెప్పుకుంది.
అయితే క్షేత్ర స్థాయిలో జరుగుతున్నది వేరు…
పేరుకు వాలంటీర్లే అయినా, వాళ్లు చేసే పనులు మాత్రం వైకాపా నేతలకు అనుకూలంగా వ్యవహరించడమే.
స్థానికంగా ఏ గ్రామంలో ఎవరెవరు ఏఏ పార్టీలకు మద్దతుదారులో కనిపెట్టడమే పనిగా వీరు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణకు ఎన్నికల పనులకు వాలంటీర్లను వాడుకోరాదంటూ ఎన్నికల సంఘం పలుమార్లు ఆదేశాలిచ్చింది. కానీ ఆ ఆదేశాలను వైకాపా నేతలు తుంగలో తొక్కుతూ వాలంటీర్లతో పనిచేయించుకుంటున్నారు. అలా ఓటరు నమోదు, తొలగింపు, ఓటుకు ఆధార్‌ కార్డు అనుసంధానం తదితర పనులకు వీరిని నియోగిస్తున్నారు. పోనీ ఇదంతా సజావుగా జరుగుతోందా అంటే, అదీ లేదు. స్థానిక ప్రజల్లో వేరే పార్టీలకు మద్దతు ఇస్తున్నవారు, ప్రతిపక్షాల సభలకు స్వచ్ఛందంగా హాజరవుతున్నవారు ఎవరెవరో వాలంటీర్లు నిఘా వేస్తున్నారు. ఆయా వ్యక్తుల ఓట్లను జాబితా నుంచి తొలగించడం లాంటి అక్రమ విధానాలకు పాల్పడుతున్నారు. అలాగే వైకాపా మద్దతుదారులను పెద్ద ఎత్తున ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. వాలంటీర్ల అడ్డగోలు వాడకం ఇంతటితో ఆగడం లేదు. రేషన్‌ కార్డులు, ప్రభుత్వ పథకాల లబ్దిదారుల జాబితాలపై కూడా వీరి అజమాయిషీ కొనసాగుతోంది. ప్రతిపక్షాల మద్దతు దారులనే అనుమానం కలిగితే చాలు రేషన్‌ కార్డులను రద్దు చేయించడం, పథకాల లబ్దిదారుల జాబితా నుంచి పేర్లు తొలగించడం లాంటి పనులను కూడా వాలంటీర్లు చక్కబెడుతున్నారనే విమర్శలు గ్రామ స్థాయిలో ఎవరిని కదిపినా వినిపిస్తాయి. అంతేకాదు ముఖ్యమంత్రి జగన్‌ సొంతమైన సాక్షి దిన పత్రిక అమ్మకాల విషయంలో కూడా వాలంటీర్లు పాలు పంచుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో వేరే చెప్పక్కరలేదు. వాలంటీర్లతో పాటు వైకాపా ప్రతి సచివాలయానికీ ముగ్గురు వంతున కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ సారధిని నియమిస్తోంది. అయితే వీరిలో అత్యధికులు వాలంటీర్ల కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. నిజానికి వాలంటీర్ల నియామకంలోనే వైకాపా మద్దతుదారులు, అనుచరులు, సభ్యులకే ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చిందనే ఆరోపణ కూడా ఉంది. అంటే… తమ అనుచరులతో గ్రామ స్థాయిలో, సచివాలయాల స్థాయిలో ఒక పటిష్ఠమైన నెట్‌ వర్క్‌ ను వైకాపా ఏర్పాటు చేసుకుందన్నమాట. వీరందరికీ జీతభత్యాలుగా ప్రజల సొమ్మును వెచ్చిస్తూ జగన్‌ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికే వక్రభాష్యాలు చెబుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
* బాహాటంగా ఆదేశాలు…
ఎన్నికలు సమీపిస్తున్న ఈ తరుణంలో వైకాపా ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు బాహాటంగానే వాలంటీర్లను పార్టీ పనులకు వాడుకుంటున్న దాఖలాలు సర్వత్రా కనిపిస్తున్నాయి. వైకాపా నేతల మెప్పు కోసం వాలంటీర్లు అధికార పార్టీ రాజకీయ సమావేశాలు, కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.
”ఎన్నికల్లో వైకాపాను గెలిపించడానికి కృషి చేయండి. పార్టీ అభివృద్ధికి పాటుపడండి” అంటూ అమాత్యులు, శాసనసభ్యులు వాలంటీర్లను పిలుపునిస్తున్నారు. కొన్ని రోజులుగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజక వర్గ ఇంఛార్జులు, ఇతర ప్రజా ప్రతినిధులు వాలంటీర్లతో రాజకీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు.
”ఎన్నికల్లో వైకాపాను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి సచివాలయాల కన్వీనర్లతో కలిసి వాలంటీర్లు పని చేయాలి” అంటూ వైకాపా నేతలు బాహాటంగానే ఆదేశాలు జారీ చేస్తున్నారు.
ప్రజాధనాన్ని జీతాలుగా తీసుకునే వారిని పార్టీకి పనిచేయమంటూ మంత్రులు ఆదేశించడమేంటనే ప్రశ్నకు సమాధానం అధికార మదంతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వం నుంచి ఆశించడం వెర్రితనమే అవుతుంది.
”వాలంటీర్లు, వైకాపా సచివాలయ కన్వీనర్లు జగనన్నకు రెండు భుజాల్లాంటివారు. ఎన్నికల్లో వీరే కీలకం. కన్వీనర్లుగా, గృహ సారధులుగా వాలంటీర్లు తమ కుటుంబ సభ్యులనే నియమించుకోవాలి” అంటూ మంత్రి సురేష్‌ ఈమధ్య ప్రకాశం జిల్లాలో నిర్వహించిన సమావేశంలో దిశానిర్దేశం చేశారు.
”ఎన్నికల్లో మరో పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తొలగిస్తుంది. కాబట్టి మీరంతా పార్టీకి పనిచేయండి. తిరిగి వైకాపా అధికారంలోకి రాగానే వాలంటీర్ల వేతనాన్ని రూ. 15 వేలకు పెంచేందుకు సీఎం జగన్‌ సిద్ధంగా ఉన్నారు” అంటూ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం సమావేశంలో మంత్రి పినిపే విశ్వరూప్‌ ఇటీవల స్పష్టంగానే చెప్పారు.
”రాబోయే ఏడాది కాలం వైకాపాకి ఉపయోగపడేలా, వైకాపా నాయకుల ఇష్టానికి అనుగుణంగా నడుచుకోండి. మీరు మాకు ఉపయోగపడితే మేం మీకు దారి చూపిస్తాం” అంటూ రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మామిడికుదురులో జరిగిన సమావేశంలో తేల్చేశారు.
పార్టీ సమావేశాలకు వాలంటీర్లు తప్పని సరిగా హాజరు కావాలంటూ వైకాపా నేతలు హుకుం జారీ చేయడమే కాదు, అలా హాజరుకాని వారిపై కక్ష సాధింపు చర్యలకు సైతం పాల్పడుతున్నారనడానికి ఎన్నో ఉదాహరణలు అడుగడుగునా కనిపిస్తున్నాయి.
మంత్రి సురేష్‌ ప్రకాశం జిల్లా పుల్లల చెరువులో నిర్వహించిన సమావేశానికి వాలంటీర్లు పెద్దగా హాజరు కాకపోవడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. రాజోలు ఎమ్మెల్యే అయితే హాజరుకాని వాలంటీర్లకు నోటీసులిచ్చి తొలగిస్తామంటూ బెదిరింపులకు సైతం దిగారు.
ఇలా సొమ్మొకడిది…సోకొకడిది అన్నట్టు ప్రజా ధనాన్ని తమ ఇష్టానుసారం వేతనాలుగా ఇస్తూ, వారిని సొంత పార్టీ పనులకు వాడుకోవడం చట్టవిరుద్ధమని ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు చేస్తున్న ఆరోపణలు అరణ్యరోదనలుగానే మిగిలిపోతున్నాయి.
ఎందుకంటే…
వైకాపా ప్రభుత్వానిది జనస్వామ్యం కాదు… స్వజనసామ్యం!!