ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతు ఖాతాకి సొమ్ము
• అక్టోబర్ 1 నుంచి ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు
• రైతు పండించిన ప్రతి గింజా కొనే విధంగా ప్రణాళికలు
• ధాన్యం అమ్మకం, మిల్లుల ఎంపికలో రైతుకే స్వేచ్ఛ
• ప్రతి అడుగులో పారదర్శకంగా వ్యవహరిస్తాం… ప్రతీ రైతుకీ భరోసా ఇస్తాం…
• రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్
• ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా అధికారులు, సహకార, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులతో వర్క్ షాపు
రైతు నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోపు వారి ఖాతాలకు సొమ్ము జమ చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. అందుకోసం పూర్తి స్థాయిలో సాంకేతిక సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. రైతు పండించిన ప్రతి గింజా కొనుగోలు చేసే విధంగా కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని, ధాన్యం అమ్మకం నుంచి మిల్లు ఎంపిక చేసుకునే వరకు రైతుకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండబోతున్నాయని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రైతుకి భరోసా ఇచ్చే విధంగా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుందని తెలిపారు. ఐదేళ్ల పాలన గురించి ఒక్క రోజు కూడా గర్వంగా చెప్పుకోలేని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అద్భుతం చేశామని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. నిజాయతీ ఉంటే రైతులకు రబీ ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించకుండా వెళ్లిపోయారో చెప్పాలన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా తగ్గకుండా నిజాయతీగా ప్రజల పక్షాన నిలబడ్డామని అన్నారు. శుక్రవారం సాయంత్రం విజయవాడలో పది జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, సహకార, వ్యవసాయ శాఖల అధికారులతో ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు అనుసరించాల్సిన విధివిధానాలపై వర్క్ షాపు నిర్వహించారు. ఆనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ.. “కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి రైతును ఆదుకునే విధంగా, రైతు కష్టపడి పండించిన ప్రతి గింజకు భరోసా ఇచ్చే విధంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రారంభించబోతున్నాం. అందుకు సన్నద్దంగా పది జిల్లాలకు చెందిన జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ, మార్కెటింగ్, కో ఆపరేటివ్, వ్యవసాయ శాఖల అధికారులతో వర్క్ షాపు ఏర్పాటు చేశాం. రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో ఈ వర్క్ షాపులు నిర్వహిస్తాం. సుమారు 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. క్షేత్ర స్థాయిలో ప్రతి రైతుకీ గౌరవం ఇచ్చే విధంగా, కొనుగోళ్ల ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాంకేతికతను ఉపయోగించి ముందుకు వెళ్లే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. కొనుగోళ్లు పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశాము. రైతు సహాయక కేంద్రాల సిబ్బంది, ధాన్యం కొనుగోలు కేంద్రాల సిబ్బందితో పాటు క్షేత్ర స్థాయిలో రవాణాకి ఇబ్బందులు లేకుండా పెద్ద సంఖ్యలో లారీలు సిద్ధం చేస్తున్నాం. జీపీఎస్ కి అనుసంధానం చేసి ప్రతి బస్తా ట్రాన్స్ పోర్టు డేటా తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశాం. పూర్తి స్థాయిలో సంచులు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట మేరకు రైతు ధాన్యం మిల్లరుకు అప్పగించిన 48 గంటల్లోపు వారి బ్యాంకు ఖాతాలకు డబ్బు చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం. వ్యవసాయ రంగానికి పూర్తి భరోసా ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
• రైతుకి అండగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానాలు
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 100 రోజులు నిండిన సందర్భంగా క్షేత్ర స్థాయిలో నిబద్ధతతో రైతుకి అండగా నిలిచే విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ విధానం అమలు చేస్తాం. సాంకేతికత ఉపయోగించి డబ్బు చెల్లించేందుకు సిద్ధమవుతున్నాం. అక్టోబర్ 1వ తేదీ నుంచి చేయబోయే కొనుగోళ్లలో రైతులకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూస్తాం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి ఎకరానికి పరిహారం ఇచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
• అద్భుతం చేస్తే.. ధాన్యం బకాయిలు ఎందుకు వదిలి వెళ్లారు?
వైసీపీ 2019లో వచ్చిన 100 రోజులలోనే అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నిజాయతీ ఉంటే గత రబీలో కొనుగోలు చేసిన ధాన్యం తాలూకు రూ. 1674 కోట్ల బకాయిలు ఎందుకు చెల్లించలేదో సమాధానం చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత 30 రోజుల్లోనే వారు వదిలి వెళ్లిన బకాయిలు చెల్లించాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రజలను, రైతులను ఏ విధంగా ఆదుకున్నామో అంతా చూశారు. రూ. 11 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు. వారి మాటల్లో నిజాయతీ లేద”న్నారు. వర్క్ షాప్ లో పౌర సరఫరాల శాఖ ఎండీ శ్రీ వీర పాండియన్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ శ్రీ మంజిర్ జిలానీ సమూర్, వివిధ జిల్లాల జాయింట్ కలెక్టర్లు, పౌరసరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు.