ప్రేక్షకులులేని సినిమా థియేటర్లు

కరోనా రెండో దశ విజృంభన, లాక్‌డౌన్‌ నేపథ్యంలో మూతపడిన సినిమా థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుండి ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనల ప్రకారం భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా థియేటర్ల యజమానులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ధర్మల్‌ స్క్రీనింగ్‌ తరువాతే ప్రేక్షకులను థియేటర్‌లోకి అనుమతించారు. తొలి రోజు ఆయా థియేటర్లలో ఇస్క్‌, తిమ్మరుసు, నరసింహపురం చిత్రాలను ప్రదర్శించారు. అయితే బిగ్‌స్క్రీన్‌పై సినిమా చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపలేదు. థియేటర్ల వద్ద జనాలు లేకపోవడంతో పలు చోట్ల షోలు ప్రదర్శించలేదు.

విశాఖ జిల్లా వ్యాప్తంగా దాదాపు 60 శాతం థియేటర్లలో సినిమాలను ప్రదర్శించారు. ఉదయం మార్నింగ్‌ షోతో తెరుచుకున్న థియేటర్లలో మ్యాట్నీ, ఫస్ట్‌ షోలను మాత్రమే ప్రదర్శించారు. థియేటర్లలో 50 శాతం మించి సీటింగ్‌ ఉండకూడదని ప్రభుత్వం నిబంధన మేరకు కలెక్షన్లు లేవు. శ్రీకాకుళం నగరంలోని రెండు, రణస్థలం, రాజాం, పాలకొండలో ఒక్కో థియేటర్‌ తెరుచుకున్నాయి. అయితే సినిమా థియేటర్లకు వచ్చేందుకు ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు.

విజయనగరం జిల్లా కేంద్రంలో 11 థియేటర్లకు గాను ఏడు థియేటర్లు తెరుకున్నాయి. మండల కేంద్రాల్లో ఓపెన్‌ అయినప్పటికీ జనాలు లేకపోవడంతో చాలా చోట్ల షోలు నిలిపివేశారు. కృష్ణా జిల్లాలో 225 సినిమా థియేటర్లకుగాను సుమారు 30 థియేటర్లు మాత్రమే తెరుచుకున్నాయి. జిల్లాలో మల్టీఫ్లెక్స్‌ థియేటర్లన్నీ ఓపెన్‌ అయ్యాయి.

అయితే థియేటర్లలో ప్రేక్షకులు మందకొడిగానే కనిపించారు. కడపలో రెండు, కర్నూలు జిల్లాలో 15 థియేటర్లను మాత్రమే ఓపెన్‌ చేశారు. అన్ని చోట్లా అరకొరగానే ప్రేక్షకులు కనిపించారు. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, ఏలూరు, భీమవరంల్లోని కొన్ని థియేటర్లు మాత్రమే తెరుచుకున్నాయి. తెరిచిన థియేటర్లు కూడా పెద్ద డిస్ట్రిబ్యూటర్లు లీజుకు తీసుకున్నవే కావడం విశేషం.