ముద్రగడ నోరు మూసుకుని కూర్చుంటే బాగుంటుంది – కాపు సంక్షేమ సేన

పాలకొల్లు, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ కాపు సంక్షేమసేన వ్యవస్థాపకులు చేగొండి హరిరామ జోగయ్య స్పందిస్తూ ఒక లేఖ విడుదల చేయడం జరిగింది. దానిలో కాపు సామాజికవర్గం ఏనాటి నుండో కలలుకంటున్న రాజ్యాధికారం దక్కించుకోవటం ద్వారా లభించనున్న ముఖ్యమంత్రి పదవి చంద్రబాబు నాయుడుకి ముఖ్యమంత్రి పదవి ధారపోయటానికి పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారేమో అని కాపు సామాజికవర్గం మరియు బడుగు బలహీన వర్గాలు ఆందోళన చెందుతున్న సమయంలో వారాహి విజయ యాత్రలో ముఖ్యమంత్రిగా నాకు 10 సంవత్సరాలు అధికారం ఇవ్వండి, మీరు కోరుకున్నట్లుగా మీ సంతృప్తి మేరకు పని చేయలేకపోతే 2 సంవత్సరాలలోనే తప్పుకుంటా అని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయటం కాపు సామాజికవర్గం యావత్తుకు సంతృప్తి కలుగచేసిన మాట వాస్తవం. సంక్షేమానికి తాను వ్యతిరేకిని కాదు అంటూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నింపకుండా సంపద సృష్టించి ప్రభుత్వ నిధులను దోచుకోవటాన్ని అరికట్టటం ద్వారా మాత్రమే ప్రజలు ఆశిస్తున్న సంక్షేమ పధకాలు అమలు జరుపుతానంటూ పవన్ కళ్యాణ్ ప్రకటించటం ప్రజా సంక్షేమం పట్ల ఆయనకున్న కమిట్మెంట్ ఎంతో తెలుస్తూ ఉంది. జనాభా ప్రాతిపదికనే బడుగు బలహీన వర్గాలయిన కాపులు, బి.సి.లు, ఎస్.సి.లు, ఎస్.టి.లు, మైనారిటీలు, అగ్రవర్ణాల పేదలకు సంక్షేమ ఫలాలు అందచేయటం ద్వారా సమ న్యాయం చేస్తానని ప్రకటించినవాడు ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. జనాభా ప్రాతిపదికనే రాజకీయ పదవులు కట్టబెడతానన్నవాడు కూడ పవన్ కళ్యాణే. కులాలకతీతంగా మాత్రమే వరిపాలన సాగిస్తానని ప్రమాణం చేసినవాడు పవన్ కళ్యాణ్ మాత్రమే. బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కంచగల సామర్థ్యం ఉన్న ఒకే ఒక నాయకుడు కూడ పవన్ కళ్యాణే. విద్య, ఉద్యోగాలు, రాజకీయ పదవుల్లో జనాభా ప్రాతిపదికన కాపులకు, బి.సి.లకు రిజర్వేషన్స్ సౌకర్యం కలుగచేస్తానని ప్రకటన చేసినవాడు పవన్ కళ్యాణ్. ఉపాధి కలుగచేయటమే ధ్యేయంగా నిరుద్యోగ యువకులకు ప్రతి నియోజకవర్గంలో 5 సంవత్సరాలలో 500 మందికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు పరిశ్రమలు, వ్యాపారాలు స్థాపనకు ప్రభుత్వంచే ఉచితంగా నిధులు సమకూరుస్తానన్నవాడు పవన్ కళ్యాణ్. ఉపాధి లేక అత్యధికంగా రేడ్లు పెరిగిపోయిన నిత్యావసర వస్తువులు కొనలేక, అత్యధికం పెరిగిన కరెంటు ఛార్జీలు కట్టలేక, స్కూలు ఫీజులు కట్టలేక, కలుషితమైన మంచినీళ్ళు త్రాగలేక, వ్యవసాయ పెట్టుబడులకు తీసుకున్న ఋణాలు తిరిగి తీర్చలేక, ఉద్యోగాలు లేక సరైన పరిష్కారాలు లభించక కుటుంబాలను పోషించలేక నానా యిక్కట్లు పడుతున్నటువంటి తెల్లకార్డు కుటుంబాలందరికీ తమ ప్రభుత్వం ద్వారా పరిష్కార మార్గాలు సూచిస్తూ తమ ఎన్నికల మేనిఫెస్టోలో భరోసా కల్పించటానికి సిద్ధమయ్యాడు జన నాయకుడు పవన్ కళ్యాణ్. నీతివంతమైన పరిపాలన అందించటానికి నడుం బిగించాడు జనసేనాని.

వృత్తిదారులయిన, కల్లు గీత కార్మికులు, రజకులు, నాయీ బ్రాహ్మణులు, యాదవులు, చేనేతకారులు, పట్టు రైతులు, కంసాలకు, కుమ్మర్లకు, కమ్మర్లకు, అగ్నికుల క్షత్రియులకు చేదోడుగా ప్రత్యే పధకాలు త్వరలో రచించనున్న జన నాయకుడు పవన్ కల్యాణ్. జనసేన పరిపానా విధానాలు నచ్చి, వారిచ్చిన హామీలను మెచ్చి వపన్ కళ్యాణ్ రాజ్యాధికారం దక్కించుకొనే వరకు ముఖ్యమంత్రి పీఠం అదిష్టించే వరకు కష్టాల్లో పాలు పంచుకుంటూ అతని వెంటే నడవటానికి సిద్దం అయ్యింది కాపు సంక్షేమ సేన. కాపు సామాజికవర్గమంతా ఏకమై పార్టీలకతీతంగా తోటి బడగు బలహీన వర్గాలయిన బి.సి., ఎస్.సి., ఎస్.టి., మైనారిటీలతో చేయి చేయి కలిపి నీతివంతుడైన జనసేన అధ్యక్షుడికి రాజ్యాధికారం కట్టబెట్టటానికి నడుం బిగించాలని, పోరాటం సాగించాలని విజయపధంలో వారాహి యాత్ర ద్వారా దూసుకుపోతున్న పవన్ని అనుసరించాలని కాపు సంక్షేమ సేన పిలుపునిస్తోంది. ఏవిధమైన అధికారం లేని చిన్న చిన్న మంత్రి పదవులు ఆశించో, ఇతర ప్రలోభాలకు లొంగో కాపు సామాజిక వర్గాన్ని అవినీతి చక్రవర్తి అయిన రెడ్డి కులాధిపతికి తాకట్టు బెట్ట ప్రయత్నిస్తున్న కాపు నాయకులను నమ్మి మోసపోకండని కాపులకు సలహాఇస్తున్నాను. ఈ సందర్భంగా ఈ రోజున జనసేన అధిపతి, కాపులందరకు ప్రియతమ నాయకుడు, నీతివంతుడు, బడుగు బలహీనవర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోటానికి రాత్రింబవళ్ళు శ్రమిస్తున్న పవన్ కళ్యాణ్ పై విశ్రాంత రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారు చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలు, విమర్శలు గురించి ప్రస్తావించవలసియుంది. ఇంతవరకు ముద్రగడ చాలా పెద్ద మనిషి అని అనుకున్నాను. వివాదరహితుడు అనుకొన్నాను. కాపుల సంక్షేమం కోరే ఒకే ఒక వ్యక్తి అనుకొన్నా. కాపులకు రాజ్యాధికారం కోరే ప్రముఖుడు అని అనుకున్నా. కాని ఆయన పట్ల నాకున్న నదభిప్రాయానికి ఆయన ఈ రోజున పవన్ కళ్యాణ్ పై ఎక్కుపెట్టిన బాణాలతో తూట్లు పొడిచినట్లయింది. చిన్న చిన్న మంత్రి పదవులు ఆశించో, ఇతర ప్రలోభాలకు లొంగో అవినీతి చక్రవర్తి జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా కాపు సామాజికవర్గాన్ని తాకట్టు పెట్ట చూస్తున్న ఆయనకు ఊడిగం చేస్తున్న కొంతమంది కాపు నాయకులు లైనులో ఈయన కూడ చేరినట్లయింది. ఈయన విద్య ఉద్యోగాలలో కాపులకు రిజర్వేషన్స్ సౌకర్యం కలుగ చేయటం కోసం చేసిన ఉద్యమాలు చిత్తశుద్ధితో చేసినవే అని నమ్మాను. అవి కూడా రాజకీయ లబ్ధి కోరి చేసినవే అని ఇప్పుడు అర్ధం అవుతుంది. లేనిచో ఎన్నికల ముందు కాపులకు రిజర్వేషన్స్ నా పరిధిలో లేదంటూ ప్రకటనలు చేసి బి.సి కులస్తులను ఆకర్షించుటకు జగన్ మోహన్రెడ్డి చేసిన ప్రకటనను ఖండిస్తూ వై.ఎస్.ఆర్ పార్టీని ఎన్నికలలో వ్యతిరేకించండి అంటూ ఎందుకు ప్రకటించలేదో వారే సెలవివ్వాలి. ఆ రోజుల్లో తెర వెనుక వై.ఎస్.ఆర్.సి.పి.కి మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా నటించి పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు సైతం కాపుల ఓట్లు పడకుండా చేసింది మీరు కాదా అని వారిని ప్రశ్నిస్తున్నా కాపు రిజర్వేషన్స్ ఉద్యమాన్ని గంగలో కలిపి మధ్యలో రాజీనామా చేసి కాపులకు అన్యాయం చేసింది కూడా మీరు కాదా అని అడుగుతున్నా.

ఏనాటి నుండో కాపు సామాజికవర్గం రాజ్యాధికారాన్ని కోరుతున్న మాట నిజం. రాజకీయ పార్టీ పెట్టి, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కాపులు, బి.సి.లు, ఎస్.సి.లు, ఎస్.టి.లు, మైనారిటీల సహకరంతో ఒక్కడుగా పోరాటం చేస్తూ విజయపధం వైపు ముందుకు దూసుకుపోతున్న కాపు కలస్తుడైన పవన్ కళ్యాణ్ పై అభాండాలు వేసి రాజ్యాధికారం కోరుకుంటున్న లక్షలాది కాపు కులస్తుల లక్ష్యాన్ని చెడగొట్టటానికి మీరు చేస్తున్న ఈ ప్రయత్నం వెనుక కాపు వ్యతిరేకి జగన్ మోహన్రెడ్డి హస్తం లేదా అని అడుగుతున్నా. కాపు కులస్తులకు పుట్టినవాడు ఎవడైనా ఇటువంటి దుశ్చర్యకు పాలుపడతాడా అని అడగవలసి వస్తుంది. కాపులకు రాజ్యాధికారమే మీరు చిత్తశుద్ధితో కోరుకుంటే మీరు కాని, మరొక సమర్థుడైన కాపు కులస్తుడిని కాని వై.ఎస్.ఆర్ పార్టీ తరపున రాబోయే ఎన్నికలలో ముఖ్యమంత్రిగా పోటీలోకి దించటానికి జగన్మోహనరెడ్డిని ఒప్పించగల దమ్ము మీకు ఉందా అని అడగాల్సి వస్తుంది. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చేస్తున్న రౌడీయిజం, బ్లాక్ మెయిలింగ్, అక్రమ వ్యాపారాలు, స్మగ్లింగ్లపై పవన్ కళ్యాణ్ కాకినాడ బహిరంగ సభలో ప్రస్తావించటంలోని జౌచిత్యాన్ని ముద్రగడ గారు ప్రశ్నించవలసిన పని లేదు. ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి గార్కి, బినామీగా ఉంటూ ఇటువంటి అభియోగాలకు పాల్పడుతున్న చంద్రశేఖరరెడ్డి వైఖరి రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు, అవి సమర్ధనీయం కూడా. పద్మనాభం గారు ప్రశ్నించినట్టుగా ముఖ్యమంత్రిగా రాష్ట్ర పరిపాలన చేపట్టాలంటే 175 నియోజకవర్గాలలో పోటీ పెట్టగల సత్తా ఉండి మెజారిటీ సంపాదించవలసిన పని లేదు. కింగ్ మేకర్ అవగల సీట్లు గెలుపొందగలిగినా రాష్ట్ర పరిపాలన చేపట్టవచ్చనే ఇంగిత జ్ఞానం కొంతైనా లేకపోతే మీరు రాజకీయం ఎలా చేస్తున్నారో అర్ధం కావటం లేదు. కాకినాడలో పోటీ పెట్టి నెగ్గమని పవన్ కళ్యాణ్ కి సవాలు చేశావు. నీ స్వంత నియోజవర్గం అయిన ప్రత్తిపాడులో ఇండిపెండెంట్ కాని, వై.ఎస్.ఆర్ పార్టీ తరపున కాని మీరు పోటీ పెట్టి నెగ్గగలిగితే మీ పరపతి ఎంతో మేము కూడ చూసి సంతోషిస్తాం. అనవసరంగా వై.సి.పి.లో చేరి అభాసుపాలవకండి. మీకున్న కొద్దిపాటి పరపతి కోల్పోతారు.

తెలుగుదేశంతో కాని, బి.జె.పితో కాని పొత్తు లేదని పవన్ కళ్యాణ్ ప్రకటించలేదే. పొత్తులు ఉన్నా తానే ముఖ్యమంత్రి అని ప్రకటించటం సంతోషమే కదా. అయినా పదవులు పందేరం ఇప్పటి నుంచీ జరిగే ప్రక్రియ కాదు కదా. ముఖ్యమంత్రి పదవి తనకు దక్కితేనే పొత్తులు అనే సందేశమే కదా పవన్ కళ్యాణ్ ఇచ్చింది. మనం సంతోషించాల్సిందే కదా. ఏది ఏమైనా మీరు పవన్ కళ్యాణ్ పై చేస్తున్న అభియోగాలు రాజకీయ లబ్ధి కోరి చేస్తున్నవని, రాక్షస పరిపాలన సాగిస్తున్న జగన్ మోహన్రెడ్డిని రక్షించటానికే ఈ పని చేస్తున్నారని మీపై అభియోగం మోపవలసి వస్తుంది. ఇకముందు ఇటువంటి పనులు చేయకుండా నోరు మూసుకుని కూర్చుంటే అందరూ సంతోషిస్తారని అన్నారు.