భద్రాద్రి రామాలయంలో ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు

భద్రాద్రి రామయ్య ఆలయంలో నేటి (మంగళవారం) నుంచి ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. భదాద్రిలో సీతారాముల కల్యాణం అనంతరం అత్యంత వైభవంగా నిర్వహించే ముక్కోటి ఏకాదశికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాలు నేటితో ప్రారంభమై జనవరి 4వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు కొనసాగనున్నాయి. మంగళవారం నుంచి ఈ నెల 25 వరకు పగలు ఉత్సవాలు, 25 నుంచి జనవరి 4వ తేదీ వరకు రాపత్తు ఉత్సవాలు జరుగనున్నాయి. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు విలాసోత్సవాలు, జనవరి 10వ తేదీన స్వామివారికి విశ్వరూప సేవ జరుగనుంది. మంగళవారం నుంచి భదాద్రి సీతారాముడు రోజుకో రూపంలో భక్తులను అనుగ్రహించనున్నారు. అలంకారాల దర్శనం కోసం చిత్రకూట మండపం సిద్ధమైంది. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు స్వామి వారు మత్స్యావతారంలో కనిపించనున్నారు.