ఏపీలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్..

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది.. 12 కార్పొరేషన్లు, 71 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా.. మొత్తం 78.71 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 75 మున్సిపాలిటీలకు గానూ.. చిత్తూరు జిల్లా పుంగనూరు, కడప జిల్లా పులివెందుల, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 71 మున్సిపాలిటీల్లోని 1,634 వార్డుల్లో పోలింగ్‌ జరుగుతోంది..

ఇక, 12 కార్పొరేషన్లలో మొత్తం 671 డివిజన్లు ఉండగా వీటిలో 89 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 డివిజన్లలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో మొత్తం …7,552 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో కరోనా నిబంధనలు అమలు చేస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తుకు పోలీసుశాఖ ఏర్పాట్లు చేసింది. ఈనెల 14న మున్సిపల్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. మొత్తంగా ఏపీలో ఇవాళ జరగుతోన్న ఎన్నికల్లో 77,73,231 మంది ఓటర్లు నేతల భవితవ్వాన్ని తేల్చనున్నారు.. వీరిలో పురుష ఓటర్లు 38,25,129, మహిళా ఓటర్ల సంఖ్య 39,46,952, ట్రాన్స్‌జెండర్లు సంఖ్య 1150గా ఉంది.