మురళీధరన్ బయోపిక్: విజయ్ తప్పుకున్నాడు..

అనేక విమర్శలు, వివాదాల అనంతరం విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి ‘800’ ప్రాజెక్టు నుంచి తప్పుకొన్నారు. శ్రీలంక క్రికెటర్, స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా.. ప్రముఖ తమిళ నటుడు, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తున్న ‘800’ సినిమాపై తమిళ సంఘాలు, సినీ పెద్దలు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో #ShameOnVijaySethupathi హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. తన జీవిత కథను సినిమాగా తీస్తుంటే పలువురు నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో

మురళీధరన్‌ తన బయోపిక్‌ నుండి వైదొలగాలంటూ విజయ్‌ సేతుపతికి రిక్వెస్ట్ చేయడంతో ఆయన ధన్యవాదాలు చెబుతూ తన నిర్ణయాన్ని తెలిపారు.

మురళీధరన్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. “Thank you and goodbye” అంటూ ఈ చిత్రం నుంచి తాను తప్పుకుంటున్నట్లు తెలిపారు విజయ్ సేతుపతి.

”నా బయోపిక్‌ ‘800’ మూవీ ప్రకటించిన తర్వాత కొందరు కొన్ని విమర్శలు చేశారు. కొందరి వ్యక్తులకు నా మీదున్న తప్పైన అవగాహనతో ‘800’ సినిమా నుండి వైదొలగమని నటుడు విజయ్‌ సేతుపతికి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నా కారణంగా తమిళనాడులోని ఓ మంచి నటుడు బాధపడకూడదని.. భవిష్యత్తులో విజయ్‌ సేతుపతికి కెరీర్‌ పరంగా ఎలాంటి సమస్యలు రాకూడదని, ఆయన్నీ ఈ సినిమా నుండి వైదొలగమని కోరుతున్నాను.

నేను జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగడం వల్లే ఇవాళ ఈ స్థాయిలో ఉన్నా. నా బయోపిక్‌ యువతలో స్ఫూర్తినింపుతుందని భావించా. కానీ అది ఆగిపోయింది. దర్శక, నిర్మాతలు సమస్యల్ని పరిష్కరించి, సినిమాను ప్రేక్షకులకు చేరవేస్తారని ఆశిస్తున్నా. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో అండగా నిలబడిన అందరికీ ధన్యవాదాలు” అన్నారు ముత్తయ్య మురళీధరన్.