దుర్గగుడి వెండి సింహాల మాయం కేసులో వీడిన మిస్టరీ

దుర్గగుడి అమ్మవారి ఆలయంలో వెండి సింహాల మాయం కేసు మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసుకు సంబంధించి నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఓ నేరస్తుడిని విచారిస్తుండగా వెండి సింహాల మాయం బహిర్గతమైంది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన బాలకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా వెండి సింహాలను అపహరించానని ఒప్పుకున్నాడు. వెండి విగ్రహాలను తునిలో జ్యూయలరీ షాపులో విక్రయించినట్లు సమాచారం. 16 కిలోల బరువున్న మూడు వెండి విగ్రహాలను షాపు యజమాని కరిగించినట్లు విచారణలో తేలింది. షాపు యజమానిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితుడు బాలకృష్ణ అరెస్ట్‌ను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.