ఏపీలో పాలకులు మారినా మైనింగ్ దోపిడీ ఆగడంలేదు: నాదెండ్ల

జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మైనింగ్ అంశాలపై స్పందించారు. రాష్ట్రంలో పాలకులు మారినా మైనింగ్ దోపిడీకి అడ్డుకట్ట పడలేదని వ్యాఖ్యానించారు. అధికార పీఠంపై పాలకపక్షం మారినా ఖనిజ సంపద దోపిడీ మాత్రం ఒకే తీరున సాగుతోందని విమర్శించారు. వంతాడలో లేటరైటు తవ్వకాల పేరుతో విలువైన బాక్సైటును లక్షల టన్నుల మేర తరలిస్తున్నారని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ 2018లోనే చెప్పారని, ఇప్పుడు కూడా అదే రీతిలో బాక్సైట్ దోపిడీ కొనసాగుతోందని నాదెండ్ల వెల్లడించారు.

నాడు వంతాడలో అక్రమ మైనింగ్ కు ఎలాంటి మార్గాన్ని ఎంచుకున్నారో, ఇప్పుడు భమిడికిలొద్దిలోనూ అదే రీతిన అక్రమాలకు తెరదీశారని ఆరోపించారు. వంతాడలో ఆండ్రూ కంపెనీ 34 లక్షల మెట్రిక్ టన్నుల బాక్సైట్ తవ్వకాలకు పాల్పడిందన్న గనుల శాఖ అధికారులు, ఆ తవ్వకాలకు కొద్దిదూరంలోనే ఉన్న భమిడికలొద్ది తవ్వకాల గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారని నాదెండ్ల ప్రశ్నించారు. భమిడికలొద్దిలో సాగుతున్న తవ్వకాలపైనా విచారణ చేపట్టాలని నాదెండ్ల మనోహర్ డిమాండ్ చేశారు.