అఖిల్ కోసం కొరటాలను లైన్లో పెట్టిన నాగ్!

అఖిల్ హీరో కావడానికి ముందే యూత్ లో ఆయనకి మంచి క్రేజ్ ఉంది. దాంతో హీరోగా ఆయన గట్టిపోటీ ఇవ్వడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఆ విషయంలోనే అంచనాలు తప్పాయి. భారీ బడ్జెట్ తో అఖిల్ ఒకదాని తరువాత ఒకటిగా సినిమాలు చేసుకుంటూనే వెళుతున్నాడు .. కానీ విజయాలు మాత్రం ఆయన దరిదాపుల్లోకి రావడం లేదు. దాంతో ఆయన కెరియర్ ను గురించి నాగ్ ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నారు. అందులో భాగంగానే ఆయన సురేందర్ రెడ్డికి ఒక ప్రాజెక్టును అప్పగించారు. ఈ సినిమాకి ‘ఏజెంట్’ అనే టైటిల్ వినిపిస్తోంది. అఖిల్ ను డిఫరెంట్ లుక్ తో సురేందర్ రెడ్డి చూపించనున్నాడు.

ఆ తరువాత అఖిల్ సినిమా కొరటాల దర్శకత్వంలో ఉండనుందనే టాక్ తాజాగా షికారు చేస్తోంది. కొరటాల ఎంచుకునే కథలు .. ఆయన ట్రీట్మెంట్ కొత్తగా ఉంటాయి. పైగా ఇంతవరకూ ఆయనకు ఫ్లాప్ ఎలా ఉంటుందనేది తెలియదు. అందువలన ఆయనను నాగార్జున సంప్రదించినట్టుగా తెలుస్తోంది. అఖిల్ కోసం మంచి కథను రెడీ చేసి రంగంలోకి దిగమని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ‘ఆచార్య’ తరువాత ఎన్టీఆర్ తో కొరటాల ఒక సినిమా చేయనున్నాడు. ఆ తరువాత సినిమా అఖిల్ తోనే ఉండనుందని అంటున్నారు. ఇది అక్కినేని అభిమానులకు సంతోషాన్ని కలిగించే విషయమే.