తిరుపతి, బ్రాహ్మణలను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చెప్పారు. ఆలయాల ట్రస్ట్ బోర్డుల పాలకమండళ్ళ నియామకంలో అర్చకుడితోపాటు ఒక బ్రాహ్మణున్ని నియమిస్తామని ఆయన తెలిపారు. ఏపి బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంక్షేమ సేవా సంఘం ఉమ్మడి చిత్తూరు జిల్లా కార్యవర్గ సమావేశం ఆదివారం శ్రీనివాసమంగాపురంలోని ఓ సత్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డిలు పాల్గొన్నారు. కపిలతీర్థం వద్ద అపరకర్మలు నిర్వహించేందుకు ఇబ్బందులు ఉన్నాయని తన దృష్టికి తీసుకురాగానే టిటిడి, అటవీ అధికారులతో మాట్లాడి పరిష్కరించినట్లు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. శాశ్వత అపరకర్మ భవన్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో ఎన్నో ఆలయాలపై దాడులు జరిగాయని కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో అటువంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్లు ఆయన చెప్పారు. యువగళంలో యువనాయకులు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించిన విధంగా వేద విద్యను అభ్యసించిన బ్రాహ్మణ నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతిని ప్రభుత్వం అందిస్తుందని ఆయన తెలిపారు. భగవంతునికి భక్తునికి మధ్య వారధి అర్చకులని టిటిడి బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి చెప్పారు. దూపదీప నైవేద్యానికి నోచుకోలేని ఆలయాల కోసం టిటిడి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసేందుకు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆలయాల నిధులను ధార్మిక కార్యక్రమాలకు మాత్రమే వినియోగించాలని ఇదే తన అభిమతమని ఆయన చెప్పారు. నూతన పంచాంగాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏపి బ్రాహ్మణ, అర్చక, పురోహిత సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు దూర్వాశుల రామస్వామి, ప్రధాన కార్యదర్శి ములుగు కిరణ్ కుమార్, మల్లెం రంగనాథ శర్మ, శీను స్వామి, కాకుమాను సిద్ధాంతి, కోడూరు గౌతమ్ శర్మ, ఆలూరు సాయి విజయ్, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment