త్వ‌ర‌లోనే కొత్త రేష‌న్‌కార్డులు: ‌సీఎం కేసీఆర్

న‌ల్ల‌గొండ: త్వ‌ర‌లోనే కొత్త రేష‌న్ కార్డులు మంజూరు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. 57 ఏండ్ల వ‌య‌సు ఉన్న వారికి పెన్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే అంద‌జేస్తామ‌ని చెప్పారు. నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. ప‌ల్లె ప్ర‌గ‌తితో గ్రామాల్లో అద్భుత‌మైన ప్ర‌గతి సాధించామ‌న్నారు. హ‌రిత‌హారం, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాల‌తో గ్రామాల రూపు రేఖ‌లు మారుతున్నాయి. లంబాడీ తండాలు, ఆదివాసీ గూడెల‌ను గ్రామ పంచాయ‌తీలుగా తీర్చిదిద్దామ‌న్నారు. యాద‌వుల‌ను కాంగ్రెస్, టీడీపీ ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకోలేదు. మ‌రో 3 ల‌క్ష‌ల మందికి గొర్రెల‌ను పంపిణీ చేసుకోబోతున్నామ‌ని తెలిపారు. పేద‌ల‌ను, రైతుల‌ను క‌డుపులో పెట్టుకుని చూసుకుంటున్నాం. పోడు భూముల స‌మ‌స్య రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. త‌ప్ప‌కుండా పోడు భూముల స‌మ‌స్య‌ల‌ను కూడా ప్ర‌జా ద‌ర్బార్ పెట్టి ప‌రిష్కారం చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.