నిహారిక కొణిదెల వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్

మెగా డాటర్ నిహారిక పెళ్లిబాజాలు మోగనున్న సందర్భంగా మెగా ఫ్యామిలీలో అప్పుడే పెళ్లి సందడి మొదలైంది. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె, నటి నిహారిక కొణిదెల వివాహానికి అన్ని ఏర్పాట్లు చకాచకా జరిగిపోతున్నాయి. ఈ క్రమంలో నిహారిక వివాహ ఆహ్వాన పత్రిక అని ఆమె వెడ్డింగ్ కార్డ్ ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సాధారణంగా పెద్ద ఇళ్లల్లో పెళ్లి కార్డులు చాలా ఆడంబరంగా ఉంటాయి కానీ ఈ కార్డు చాలా సింపుల్ గా ఉంది. పెళ్లి కార్డుపై చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ పేర్లు కార్డుపై ఉన్నాయి. రాజస్థాన్‌లో నిహారిక, వెంకట చైతన్యల డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కుటుంబసభ్యులు ప్లాన్ చేశారు. ఉదయ్‌పూర్‌లో డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు మిథున లగ్నంలో అత్యంత సన్నిహితుల సమక్షంలో టాలీవుడ్ నటి నిహారిక, చైతన్యల వివాహం జరగనుందని తెలుస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలోనూ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు.

తండ్రి నాగబాబు, సోదరుడు వరుణ్ తేజ్ సహా కుటుంబపెద్దలు నిహారిక వివాహ కార్యక్రమానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. కాగా, డిసెంబర్ 11న హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో నిహారిక వెడ్డింగ్ రిసెప్షన్‌కు ప్లాన్ చేశారు. ఈ ఏడాది చివరికల్లా నిహారిక వివాహాన్ని జరిపిస్తానని గతంలో నాగబాబు చెప్పినట్లుగా వేడుక జరిపిస్తున్నారు.