నిఖిల్ ’18 పేజెస్’ ఫస్టులుక్

మొదటి నుంచి కూడా నిఖిల్ వైవిధ్యభరితమైన సినిమాలను చేస్తూ వస్తున్నాడు. అందువల్లనే యువ కథానాయకులలో నిఖిల్ కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తాజా చిత్రంగా ’18 పేజెస్’ రూపొందుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. విభిన్నమైన ప్రేమకథ నేపథ్యంలో నిర్మితమవుతున్న ఈ సినిమాలో, నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. ఈ రోజున నిఖిల్ పుట్టిన రోజు .. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేసింది.

నాయకా నాయికల మధ్య గల ఫీలింగ్స్ కి అద్దం పడుతూ వదిలిన ఈ ఫస్టులుక్, యూత్ ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కథ .. స్క్రీన్ ప్లే ను అందించినది సుకుమార్ కావడం విశేషం. గోపీసుందర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు. నిఖిల్ నుంచి ఈ ఏడాది రానున్న సినిమా ఇదే. అందువలన ఆయన ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక ఈ మధ్య జోరు తగ్గిన అనుపమకు కూడా ఈ హిట్ చాలా అవసరమే!