‘భీష్మ’తో హిట్ ఇచ్చిన వెంకీతో నితిన్!

ప్రేమకథా చిత్రాలను ఈ తరం కుర్రాళ్లకు నచ్చేలా తెరకెక్కించడంలో వెంకీ కుడుముల తన సత్తా చాటుకున్నాడు. ‘ఛలో’ … ‘భీష్మ’ సినిమాలు అందుకు ఉదాహరణగా కనిపిస్తాయి. ఈ మధ్య కాలంలో యూత్ నుంచి ఎక్కువ మార్కులు కొట్టేసిన సినిమాగా ‘భీష్మ’ నిలిచింది. అక్కడక్కడా ఎమోషన్ ను టచ్ చేస్తూ సరదాగా సాగిపోయిన ఈ సినిమా, నితిన్ కెరియర్లోనే భారీ వసూళ్లను రాబట్టింది. అందువలన అదే దర్శకుడితో మరో సినిమా చేయడానికి నితిన్ నిర్ణయించుకున్నట్టుగా ఒక టాక్ వినిపిస్తోంది.

నిజానికి ‘భీష్మ’ తరువాత వెంకీ కుడుముల ఒకటి రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టే ప్రయత్నాలు చేశాడు కానీ సెట్ కాలేదు. ఈ సమయంలోనే నితిన్ ‘చెక్’ .. ‘రంగ్ దే’ సినిమాలు చేశాడు. కానీ ఆ రెండు సినిమాలు ఆయన అభిమానులను నిరాశపరిచాయి. ప్రస్తుతం ‘మాస్ట్రో’ చేస్తున్న నితిన్ కి వెంకీ కుడుముల కథ చెప్పడం, ఆయన ఓకే చెప్పడం జరిగిపోయాయని అంటున్నారు. ఈ ఏడాది చివరినాటికి షూటింగును పూర్తిచేయాలని అనుకుంటున్నారట. ఇక కథానాయికగా రష్మికను సెట్ చేసే అవకాశాలు ఎక్కువని చెప్పుకుంటున్నారు.