అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వైసీపీ నేతలకు నామినేటెడ్ పదవులు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2019లో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన వైసీపీ నేతల కోసం నామినేటెడ్ పదవులు సిద్ధమవుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఓడిన 24 మంది నేతలకు పదవులు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, అప్పట్లో వివిధ కారణాల వల్ల టికెట్లు దక్కించుకోలేకపోయిన నేతలకు కూడా పదవులు దక్కే అవకాశం ఉందని సమాచారం.

 80 కార్పొరేషన్లకు చైర్మన్లు, డైరెక్టర్లను నియమించాలని నిర్ణయించిన ప్రభుత్వం నిన్న జాబితాను విడుదల చేయాలని భావించినప్పటికీ విడుదల కాలేదు. దీంతో ఈ జాబితాలో మార్పులు, చేర్పులు జరుగుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో టికెట్ వదులుకున్న వారికి, పార్టీ కోసం పనిచేస్తున్న వారిలో పలువురికి ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తామని జగన్ అప్పట్లో హామీ ఇచ్చారు. ఇటువంటి వారు 30 మంది వరకు ఉన్నారు. అయితే, వీరందరికీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించే పరిస్థితి లేకపోవడంతో కొందరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.