ఏలూరు, ఏలూరు నగరంలోని 20వ డివిజన్ రామకృష్ణ పురంలో మంగళవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రెడ్డి అప్పల నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, “ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతోంది. ప్రతి నెల మొదటి తేదీన ఫించన్లు పంపిణీ చేయడం ప్రారంభించడమే ఇందుకు నిదర్శనం. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తోంది,” అని తెలిపారు. మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజల అభిమానం కోల్పోయారని విమర్శించారు. అర్హత లేని వైసీపీ నేతలు ఇక రాజకీయాల్లో ఉండటం తగదని ప్రజలకు వివరిస్తామని చెప్పారు. “కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ పేరుతో నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నాం,” అని ఎమ్మెల్యే ప్రకటించారు. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ, “పేదల ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు, వారి ఆర్థిక భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సూపర్ సిక్స్ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. వృద్ధాప్య, వితంతు, దివ్యాంగులకు పెంచిన పెన్షన్లను సమయానికి అందజేస్తూ తమ మాట నిలబెట్టుకున్నారు,” అని పేర్కొన్నారు. “పేదల పట్ల నిబద్ధతతో, అన్ని విధాలుగా అండగా నిలిచే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే,” అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఈడ చైర్మన్ పెద్ది బోయిన శివ ప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారధి, నగర పాలక సంస్థ కో ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, స్థానిక నాయకులు కప్పా ఉమా, గొడవర్తి నవీన్, అచ్యుత్, పలువురు కార్పొరేటర్లు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానికంగా విశేష స్పందన పొందింది. లబ్ధిదారులు పెన్షన్లు అందుకుంటూ కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment