47కు పైగా దేశాల్లో ‘ఒమిక్రాన్’.. ఒక్క దక్షిణాఫ్రికాలోనే 70 శాతానికిపైగా కేసులు
కరోనా నుండి కాస్త కోలుకుంటున్నాం అనుకునేంతలో ‘ఒమిక్రాన్’ కొత్త వేరియంట్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తూ ప్రపంచదేశాల్లో భయాందోళనలను రేకెత్తిస్తోంది. నవంబర్ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47 కు పైగా దేశాల్లో వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు.
ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలు పనిచేస్తాయా ?
ఇప్పటికే ఒమిక్రాన్ వైరస్ కేసులు దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో పెరుగుతున్నాయి. ఆ దేశాల్లో వైరస్ వ్యాప్తి సామాజికంగా మొదలయ్యిందని నిపుణులు తెలిపారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత ఎలా ఉంది ? ఇప్పుడు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఈ ఉత్పరివర్తనానికి వ్యతిరేకంగా మరింత రోగనిరోధక శక్తిని ఇస్తాయా ? లేదా అనే విషయాలను తెలుసుకోవడానికి పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
దక్షిణాఫ్రికాలో 70 శాతానికిపైగా ఒమిక్రాన్ కేసులు..
దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గత వారంతో ప్రస్తుతం కేసుల సంఖ్యను పోల్చి చూస్తే 700 శాతం రెట్టింపయ్యాయి. గతవారం 2,300 కేసులు నమోదవగా.. ప్రస్తుతం 16 వేలకుపైగా రికార్డవుతున్నాయి. ఇందులో ఒమిక్రాన్ కేసుల సంఖ్య నిర్ధిష్టంగా తెలియకపోయినా.. 70 శాతానికిపైగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నాయి.
ప్రధాన దేశాల్లో ఒమిక్రాన్ కేసుల విస్తరణ…
గత నెలాఖరులో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా, సెనెగల్, బోట్స్‌వానా, మెక్సికో, భారత్, నెదర్లాండ్స్, హాంకాంగ్, ఇజ్రాయెల్, బెల్జియం, బ్రిటన్, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఆస్ట్రియా, కెనడా, స్వీడన్, స్విట్జర్లాండ్, స్పెయిన్, పోర్చుగల్, జపాన్, ఫ్రాన్స్, ఘనా , దక్షిణ కొరియా, నైజీరియా, బ్రెజిల్, నార్వే, అమెరికా, సౌదీ అరేబియా, ఐర్లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, రష్యా, నమీబియా, నేపాల్, థాయిలాండ్, క్రొయేషియా, అర్జెంటీనా, శ్రీలంక, మలేషియాతో పాటు సింగపూర్‌లో కొత్త వేరియంట్ కేసులు రికార్డయ్యాయి.