కొనసాగుతున్న ఆగ్రహం

కరోనా కట్టడి విషయంలో తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం కొనసాగుతోంది. తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు.. ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయ్యింది. కరోనా కేసుల విషయంలో తమ ఆదేశాలు అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమ ఆదేశాలు పట్టించుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొంది. జూన్ 8 నుంచి  ఇచ్చిన ఒక్క ఉత్తర్వును కూడా  అధికారులు అమలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అమలు చేయడం కష్టమైతే ఎందుకు వీలు కాదో అధికారులు  వివరించాలని  ఆదేశించింది. తమ ఆదేశాలపై నిర్లక్ష్యం చూపడం విచారకరమని ధర్మాసనం మండిపడింది. దీంతోపాటు కరోనా వైరస్ కేసుల వివరాలతో ఆరోగ్యశాఖ విడుదల చేస్తోన్న బులెటిన్ సమాచారం సరిగా లేదని అభిప్రాయపడింది. దీనిపై మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని వివరాలు కోరతామని తెలిపింది. కరోనా కేసులపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.