స్వస్తిక్ ఓట్లను మాత్రమే లెక్కించాలి: హైకోర్టు

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు హైక్టోర్టు షాకిచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పెన్నుతో టిక్ చేసిన ఓట్లను లెక్కించాలని ఎన్నికల అధికారులకు ఎన్నికల కమిషన్ సూచించింది. అయితే దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు పెన్నుతో ఉన్న ఓట్లను లెక్కించొద్దని.. కేవలం స్వస్తిక్ గుర్తున్న ఓట్లనే లెక్కించాలని తాజాగా ఆదేశాలిచ్చింది.

ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తుందని హైకోర్టులో బీజేపీ నేతలు తమ వాదనలు విన్పించగా హైకోర్టు ఈమేరకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ఎన్నికల అధికారులు తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కింపును పూర్తి చేసినట్లు సమాచారం.

ఈ పోస్టల్ బ్యాలెట్ ఓటింగులో బీజేపీ దూసుకెళుతోంది. తాజా సమాచారం మేరకు 150 డివిజన్లకు గాను బీజేపీ అభ్యర్థులు 79 స్థానాల్లో.. టీఆర్ఎస్ అభ్యర్థులు 35 స్థానాల్లో.. ఎంఐఎం అభ్యర్థులు 7 స్థానాల్లో.. కాంగ్రెస్ మూడు స్థానంలో అధిక్యంలో ఉన్నాయి. తాజాగా పోస్టల్ ఓట్లు పూర్తవడంతో ఇక బ్యాలెట్ ఓట్లను లెక్కించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.

ఇప్పటికే కొన్ని డివిజన్లలో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. రౌండ్ల వారీగా ఫలితాలను అధికారులు వెల్లడించారు. రౌండ్ కు 14వేల ఓట్లను లెక్కించనున్నారు. దీంతో తొలి ఫలితం మెహదీపట్నం నుంచే వెలువడనుంది. ఈ డివిజన్లలో కేవలం 11వేల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. దీంతో తొలి ఫలితం ఇక్కడి నుంచే రానుంది. చివరగా మైలార్ దేవ్ పల్లి ఫలితం వచ్చే అవకాశం ఉంది. తాజాగా హైకోర్టు ఎన్నికల కమిషన్ కు స్వస్తిక్ గుర్తును మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని ఆదేశించడంతో ఓట్ల లెక్కింపు ఆలస్యమయ్యేలా కన్పిస్తుంది.