‘వైఎస్సార్‌ జలకళ’ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు

వైఎస్ఆర్ జల కళ పథకంలో భాగంగా ఉచిత బోర్లతో పాటు పంపుసెట్లు, మోటార్లను కూడా ఉచితంగానే అమర్చాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు జలకళ పథకంలో స్వల్ప మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉచితంగానే విద్యుత్ కనెక్షన్‌ను కూడా అమర్చబోతున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. బోర్ల లోతు, భూమి రకం, ఎంతమేర పంట సాగవుతోందన్న అంశాల ఆధారంగా పంపు సెట్లు, మోటార్లను బిగించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కనీసం 2.5 ఎకరాల భూమి ఉన్న రైతు లేదా గరిష్టంగా 5 ఎకరాల వరకు ఉన్న రైతులు గ్రూపుగా ఏర్పడి బోరు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకంలో పారదర్శకంగా పనులు చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేసింది. రైతులు దరఖాస్తు చేసుకున్న తర్వాత ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి వివరాలను ఎస్‌ఎస్‌ఎంల ద్వారా పంపిస్తారు. ఈ వివరాలు ఆన్‌లైన్‌ కూడా తెలుసుకునే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దరఖాస్తు చేసుకునే రైతు భూమిలో అంతకు ముందు బోరు ఉండకూడదు. అర్హత కలిగిన వారు గ్రామ సచివాలయంలో లేదా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేసింది.