పేరెంట్స్ కు అండగా ఉంటాo.. మా పోరాటం ఆగదు..

ప్రైవేట్ స్కూళ్ల వ్యాపార ధోరణిపై సినీ నటుడు శివబాలాజీ దంపతులు మరోసారి మండిపడ్డారు. ఫీజులు అధికం చేసి .. అవి కట్టకపోతే పిల్లల్ని స్కూళ్ల యాజమాన్యాలు వేధిస్తున్నాయని ఆరోపించారు.  స్కూళ్ల ఫీజులతో కరోనా కాలంలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫీజులు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని, ఫీజులు కట్టకపోతే ఆన్లైన్ క్లాసుల ఐడీలు తొలగిస్తున్నారని వాపోయారు. వ్యక్తిగతంగా వెళ్లినా, మెయిల్స్ పెట్టినా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మౌంట్ లితేరా స్కూలు నుంచి ఇలాంటి ఒత్తిళ్లు ప్రారంభం అయ్యాయన్నారు. అనేక స్కూళ్లలో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. స్కూళ్లన్నీ సిండికేట్ అయ్యాయన్నారు. తల్లిదండ్రులకు అండగా ఉంటామని, తనకు వేరే పని లేదని, ఇదే పనిగా పెట్టుకుంటానన్నారు. శివబాలాజీ సతీమణి మధుమిత మాట్లాడుతూ.. ”ముఖ్యమంత్రిపై గౌరవంతో అడుగుతున్నాం. ప్రైవేట్ స్కూల్స్ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాయి. ట్యూషన్ ఫీజ్ మాత్రమే చెల్లించాలని ప్రభుత్వం చెప్పినా స్కూళ్లు ఇతరత్రా ఫీజులతో మానసిక క్షోభకు గురిచేస్తున్నాయి. మేం ఇప్పటికే 35 శాతం ఫీజులు చెల్లించాం. పూర్తి ఫీజు కట్టలేదని పరీక్షలు రాయనివ్వటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల బాధ అర్థం చేసుకొని ఈ సమస్యను పరిష్కరించాలి” అని సీఎం కేసీఆర్‌ను కోరారు.