తక్కువ ధరకు ఆక్సిజన్ కిట్.. హైదరాబాద్ యువకుడి వినూత్న ప్రయోగం..

కరోనా దేశవ్యాప్తంగా ఆందోళన కల్గిస్తోంది. ఆక్సిజన్, సరైన వైద్య సదుపాయాలు లేక చాలా మంది పిట్టల్లా ప్రాణాలు వదులుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎటు చూసినా ఆక్సిజన్ కొరత కనిపిస్తోంది. ఒక్క ఆక్సిజన్ సిలిండర్ దొరికితే చాలు అనుకునే ప్రాణాలు లక్షల సంఖ్యలో ఉన్నాయంటే బయట పరిస్థతి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలో హైదరాబాద్ కు చెందిన ఒక యువకుడి ప్రయత్నం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బయట ఎన్ని డబ్బులు ఇచ్చినా ఆక్సిజన్ దొరకని పరిస్థితులు ఉన్న తరుణంలో ఈ యువకుడు డిజైన్ చేసిన ఆక్సిజన్ డివైజ్ ఇప్పుడు అందర్ని ఆకర్షిస్తోంది. ఇంట్లోనే ఆక్సిజన్ అందించడం ఈ డివైజ్ ప్రత్యేకత.

హైదరాబాద్, కవాడిగూడకు చెందిన ప్రవీణ్ ఈ డివైజ్ ను తయారు చేశారు. కేవలం 72 గంటల్లోనే రూపొందించిన ఈ డివైజ్ కి ఇప్పుడు సర్వత్ర ప్రసంశలు వస్తోన్నాయి. కేవలం ఒక ప్లాస్టిక్ డబ్బాతో రూపొందించిన ఈ డివైజ్ ఇంట్లోనే ఇద్దరికి 12 గంటల పాటు ఆక్సిజన్ అందిచగలదు.

‘ద ఫై ప్యాక్టరి’ పేరుతో ఒక సంస్థను స్థాపించి ఈ ఆక్సిజన్ డివైజ్ లు రూపొందిస్తన్నారు ప్రవీణ్. కేవలం 2,500 రూపాయిలతో ఈ డివైజ్ ఇంట్లో ఉంటే ఇక ఆక్సిజన్ కోసం తిప్పలు అవసరం లేదంటున్నారు. వాయు పాత్ర పేరుతో కేవలం 2,500 రూపాయలతోనే రూపొందించారు. ఇక దీని పని తీరు కూడా చాలా ప్రత్యేకంగానే ఉంటుంది అంటున్నారు రూపకర్త ప్రవీణ్. చిన్న ప్లాస్టిక్ డబ్బాలా ఉండే ఈ డివైజ్ కి రెండు ట్యూబ్ లు అమర్చడం ద్వార ఇది పని చేస్తోంది. ఈ డివైజ్ ఆన్ చేసిన పది సెకన్లులోనే పేషెంట్ కి ఆక్సిజన్ అందుతుంది. చూడ్డానికి చిన్న బాక్స్ లా ఉన్నా ఈ పరికరం ఎక్కడికైన ఈజీ గా తీసుకెళ్లొచ్చు . ఇటువంటి సమయంలో ఈ డివైజ్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలంటున్నారు రూపకర్త. ప్రస్తుతం ప్రవీణ్ రూపోందించిన డివైజ్ కి శాఖపరమైన అనుమతులు ప్రభుత్వం నుంచి లేవు. అన్ని అనుమతులు వచ్చిన తరువాత మార్కెట్ లోకి విడుదల చేస్తామంటున్నారు ప్రవీణ్. అత్యవసరంగా ఆక్సిజన్ అవసరమైన పెషెంట్స్ కి ఈ కిట్ చాలా ఉపయోగపడుతుంది.

అత్యవసర సమయంలో అంబులెన్స్ వచ్చే టైం లో మనం ఈ కిట్ ద్వార ఆక్సిజన్ మనం పెషెంట్ కి ఇవ్వొచ్చు. దీంతో పాటు తమకు ఐడియా వచ్చిన కేవలం 72 గంటల్లోనే ఈ డివైజ్ ని రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుతం దీని అనుమతులకు కోసం అప్లై చేశాం.. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు వచ్చిన తరువాత హైదరాబాద్ వరకు ఈ డివైజ్ ను మార్కెట్ లో అందుబాటులో ఉంచాలని అనుకుంటున్నామని ప్రవీణ్ తెలిపారు. జీడిమెట్ల లో రోజుకి దాదాపు 3000 యూనిట్ల కిట్స్ తయారు చేయగల సామర్థ్యమున్న ప్లాంట్ కూడా రూపొందించామని ప్రవీణ్ తెలిపారు.