Paralympics: ఘనంగా ముగిసిన పారాలింపిక్స్‌

టోక్యో ఒలింపిక్స్, పారాలింపిక్స్ (Paralympics) అధ్యాయం ముగింపు దశకు చేరుకున్నది. చక్రవర్తి నరుహిటో సోదరుడు క్రౌన్ ప్రిన్స్ అకిషినో పర్యవేక్షణలో.. రంగురంగుల విద్యుత్‌ దీపాల మధ్య బాణాసంచా వెలుగులతో నేషనల్‌ స్టేడియం కళకళలాడింది. 13 రోజులుగా వివిధ అంశాలలో పోటీపడిన క్రీడాకారులతో ఈ ప్రాంతమంతా సందడిగా మారింది. ముగింపు వేడుకకు ‘హార్మోనియస్ కాకోఫోనీ’ అనే పేరు పెట్టారు. పలువురు నటులు, వైకల్యాలున్న ఇతరులు పాల్గొన్నారు. ముగింపు వేడుకల్లో భారత్‌ నుంచి అవని లేఖరా త్రివర్ణ పతాకంతో ముందు నడిచింది. ముగింపు వేడుకకు భారత బృందంలోని మొత్తం 11 మంది సభ్యులు హాజరయ్యారు.

టోక్యో పారాలింపిక్స్ లో 19 ఏళ్ల షూటర్ అవని లేఖరా స్వర్ణంతో పాటు రెండు పతకాలను సాధించింది. అవని ఎస్‌హెచ్‌1 క్యాటగిరీలో 10 మీ ఎయిర్ పిస్టల్‌లో స్వర్ణ పతకం, 50 మీటర్ల రైఫిల్ పోటీలో కాంస్య పతకం సాధించింది. ఈసారి భారతదేశం 5 స్వర్ణాలతోపాటు మొత్తం 19 పతకాలు సాధించి.. పతకాల పట్టికలో భారతదేశం 24 వ స్థానంలో నిలిచింది. పారాలింపిక్స్‌లో భారతదేశం క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శన ఇది.