పవన్ కళ్యాణ్ పై కక్ష సాధింపు చర్యలు హేయం

*ఆయనకొచ్చిన నష్టం ఏమీ లేదు….దెబ్బతినేది తెలుగు సినీరంగం
*అంతకన్నా 18 శాతం ఓట్లు కోల్పోయేది నువ్వే
*నీ హయాంలో ఏ పరిశ్రమా బతికిబట్టకట్టే పరిస్థితి లేదు
*ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకపడిన జేసీ ప్రభాకరరెడ్డి

పవన్ కళ్యాణ్ పై కక్షతో తెలుగు సినీ పరిశ్రమను ధ్వంసం చేయడానికి పూనుకోవడం సమర్థనీయం కాదని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హితవు పలికారు. ముఖ్యమంత్రి జగన్ కు ఇది తగదని హెచ్చరించారు. గురువారం అనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై జగన్ ను ఆయన నిలదీశారు. ప్రభాకరరెడ్డి తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. కష్టపడి పైకొచ్చి అక్రమాలకు తావివ్వకుండా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కక్ష? ఆ కక్ష మొత్తం తెలుగు సినీ రంగంపై ఎందుకు చూపిస్తున్నావు? దీని వల్ల పవన్ కళ్యాణ్ కు జరిగే నష్టం ఏమీ లేదు. ఆయన సినిమా భీమ్లానాయక్ వంద రోజులు ఆడుతుంది. నష్ట పోయేది సినిమా హాళ్ల దగ్గర పల్లీలు అమ్ముకునే వారి దగ్గర నుంచి నిర్మాతల వరకు. చివరకు చిత్ర పరిశ్రమే దెబ్బతింటుంది. బాలీవుడ్ సైతం టాలీవుడ్ వైపు చూస్తున్న ఈ తరుణంలో ఏమిటీ చర్యలు? తహశీల్దారులు, ఆర్డీవోలు పనులన్నీ వదిలి పెట్టి సినిమా హాళ్ల మీద పడటమేమిటి? పేదలకు ఎంటర్ టైన్మెంటు కూడా లేకుండా చేస్తున్నావు. ఒక్క డైరెక్టర్ కూడా రాష్ట్రంలో సినమా తీసే పరిస్థితి లేకుండా చేస్తున్నావు. పవన్ కళ్యాణ్ తో పెట్టుకున్నావు. ఆయన క్రేజ్ పెంచావు. నువ్వు 18 శాతం ఓట్లు కోల్పోయావు. స్వయంకృషితో అత్యున్నత శిఖరాలు అందుకున్న చిరంజీవి దీనంగా వేడుకున్నా నువ్వు కరగలేదు. నాకయితే ఏడుపొచ్చింది. ఇగో నీకే కాదు అందరికీ ఉంటుందనేది గుర్తు పెట్టుకో. సినిమా టిక్కెట్లపై పడిన నువ్వు టీటీడీ సేవల రేట్లు ఎందుకు పెంచావు? దేవస్థానం నీ అబ్బ సొత్తు కాదు. బీదబిక్కి తిరుపతికి రావద్దా? యువకుడు అధికారంలోకి వచ్చాడు….బాగుంటుందని భావించాను. కాని నీ హయాంలో రాష్ట్రంలో ఏ పరిశ్రమా బతికే పరిస్థితి లేదు. కాలుష్యం పేరు చెప్పి అమర్ రాజా బ్యాటరీ కంపెనీపై కక్ష కట్టావు. ఎంతో మందిని ఉపాధికి దూరం చేశావు. ఒక చిన్న ట్రాన్స్ పోర్టు ఆపరేటర్ ని. నన్ను, నా కొడుకును జైలుకు పంపావు. ఇలా ఎంతమంది మీద కక్ష కడతావు. ముందు నీ ఇంటి పరిస్థితి చూసుకో. సీబీఐ పైనా కేసులు పెడుతున్నావు. అంటూ ప్రభాకర్ రెడ్డి దుయ్యబట్టారు.