కొత్త చట్టంతో సమగ్రాభివృధ్దికి బాటలు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో హైదరాబాద్‌ నగర ప్రజల మనసు గెలిచిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మ్యానిఫెస్టో జంటనగరాల ప్రజలపై ముఖ్యమంత్రికి ఉన్న అభిమానానికి ప్రతీక అన్నారు. జీహెచ్‌ఎంసీలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చి సమగ్రాభివృధ్దికి సీఎం బాటలు వేయనున్నారని చెప్పారు. డిసెంబర్‌ నుంచి జంటనగరాల ప్రజలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా తాగునీటిని సరఫరా చేయటం హర్షణీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షౌరశాలలకు, ధోబీఘాట్‌లకు, లాండ్రీలకు డిసెంబర్‌ నుంచి ఉచిత విద్యుత్‌ను ఇవ్వడం ద్వారా సీఎం కేసీఆర్‌ పేదల పక్షపాతిగా నిరూపించుకున్నారని కొనియాడారు. సినీ కార్మికులకు రేషన్‌ కార్డులు, హెల్త్‌ కార్డులు అందించటం గొప్ప నిర్ణయం అన్నారు. మహానగర ప్రజల తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.