పవన్ ఒక వ్యసనం.. అలవాటైతే వదిలించుకోవడం కష్టం: బండ్ల గణేశ్

పవన్ కల్యాణ్ కథానాయకుడిగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ‘వకీల్ సాబ్’ ఈ నెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. నివేదా థామస్ .. అంజలి .. అనన్య ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా నిన్నరాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకుంది. ఈ సందర్భంగా ఈ వేదికపై బండ్ల గణేశ్ మాట్లాడాడు. ఆయన స్టేజ్ పైకి వస్తూనే .. “ఈశ్వరా .. పవనేశ్వరా .. పవరేశ్వరా” అంటూ అభిమానుల్లో ఒక్కసారిగా ఉత్సాహాన్ని రేకెత్తించాడు. “నిజంగా పవన్ కల్యాణ్ ఒక వ్యసనం .. అలవాటు చేసుకుంటే వదల్లేము .. వదిలించుకోలేము. కొన్ని జన్మలంతే .. కొంతమందిని ఇష్టపడటమేగానీ .. వదులుకోవడం ఉండదు. ఈ సినిమాను గురించి ఏమని మాట్లాడను. పవన్ చూడని బ్లాక్ బస్టర్లా? .. ఆయన చూడని ఇండస్ట్రీలా? ఆయన చూడని చరిత్రలా? ఏం మాట్లాడతాం ఈ సినిమాను గురించి చెప్పండి .. ఇవన్నీ ఆయనకి చిన్న చిన్న విషయాలు. ఆయన కొత్త శకానికి శ్రీకారం చుట్టాడు. వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు .. అలా చేయాలి కూడా.

నన్ను ఒక ఫ్రెండ్ అడిగాడు .. ఏంట్రా మీ బాసు రాజకీయాలంటాడు .. సినిమాలు అంటాడు అని. అప్పుడు నేను చెప్పాను మనలాగా కోళ్ల వ్యాపారం .. పాల వ్యాపారం .. సారా వ్యాపారం .. ఇవేవీ ఆయనకి లేవు కదా అన్నాను. ఆయనకి ఉన్నది ఒక్కటే బ్లడ్డు వ్యాపారం. రక్తాన్ని చమటగా మార్చుకుని .. చెమటను నటనగా మార్చి .. అభిమానులను ఆనందపరిచే క్యారక్టర్ రా అది అన్నాను. ఆయన నిజాయితీ ఏమిటో నాకు తెలుసు గనుక అలా చెప్పాను.

అందరూ పుడతారు .. పోతారు .. కొంతమంది మాత్రమే చరిత్రలో ఉంటారు. పవన్ కల్యాణ్ తో అబద్ధం చెప్పలేం .. ఆయన కళ్లు చూడగానే ఆ విషయమే మరిచిపోతాము. మీరంతా అనుకుంటున్నట్టు నేను పవన్ కి భక్తుడినే. ఏడుకొండలవాడికి అన్నమయ్య .. శివయ్యకి భక్త కన్నప్ప .. శ్రీరాముడికి హనుమంతుడు .. పవన్ కల్యాణ్ కి బండ్ల గణేశ్ అంటూ అరిచాడు. అంతే కాదు పవన్ కి ఉన్న పొగరు ఎలాంటిదంటే అంటూ గుక్క తిప్పుకోకుండా పెద్ద పెద్ద డైలాగులే చెప్పాడు. స్టేజ్ పై ఆయన మాట్లాడుతున్నట్టుగా కాకుండా ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా ఉండటంతో పవన్ తో సహా ఆడిటోరియం అంతా నవ్వుల్లో మునిగిపోయింది.