ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసు ఆవిష్కరణ చేసిన పేటీఎం

పేటీఎంకు చెందిన పేమెంట్స్ బ్యాంక్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆధార్ ఆధారిత పేమెంట్ సర్వీసు(ఏఈపీఎస్)ను పేటీఎం ఆవిష్కరించింది. తద్వారా ఆధార్ కార్డుల ద్వారా తన వినియోగదారులకు నగదు తీసుకోవడం, బ్యాలెన్స్ చెక్ చేయడం వంటి కనీస బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. త్వరలోనే నగదు డిపాజిట్, ఇంటర్‌బ్యాంక్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లను లాంచ్ చేయాలని భావిస్తోంది. ఆధార్‌తో అనుసంధానమైన దేశంలోని బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు ఎవరైనా ఏఈపీఎస్ సర్వీసులతో క్యాష్ విత్‌డ్రా, బ్యాలెన్స్ ఎంక్వైరీ వంటి సేవలు పొందవచ్చని కంపెనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా బ్యాంకు శాఖలు, ఏటీఎంలు పరిమితంగా ఉండే గ్రామీణ, సెమీ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించింది. దేశంలోని మారుమూల ప్రాంతంలోని ప్రజలు పూర్తి బ్యాంకింగ్ సేవలను పొందగలిగేలా చూడటమే తమ ప్రధాన లక్ష్యమని పేటీఎం చెల్లింపుల బ్యాంక్ సీఎండీ సతీష్ కుమార్ గుప్తా ప్రకటించారు. ఇందుకు 10,000కి పైగా వ్యాపార కరస్పాండెంట్లతో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.