వైసీపీ బస్సు యాత్రను ప్రజలు తిరస్కరించారు

బెదిరించినా, ప్రలోభపెట్టినా బస్సు యాత్రకు ప్రజలు ముఖం చాటేశారు

దళితుల్ని, బీసీల్ని, మైనారిటీలను మోసం చేసిన వైసీపీకి బస్సు యాత్ర చేసే హక్కు లేదు

వైసీపీ నేతలకో చట్టం, ప్రతిపక్ష నేతలకో చట్టం లేదని పోలీసులు గ్రహించాలి

వైసీపీ నేతలు మూటాముల్లె సర్దుకుని సిద్ధంగా ఉండండి

నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: వైసీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారిక బస్సు యాత్రను ప్రజలు తిరస్కరిస్తున్నారని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆదివారం నగర పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారులను, డ్వాక్రా మహిళలను, ఆర్పీలను, అంగన్ వాడీలను, ఆశా వర్కర్లను, వాలంటీర్లను అదిరింది, బెదిరించి, ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు లేక బస్సు యాత్ర పూర్తిగా విఫలమైందన్నారు. బస్సు యాత్రలో పాల్గొన్న మంత్రులు, శాసనసభ్యులు ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలిచ్చారని ఎద్దేవాచేశారు. అసలు దళితులను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన, బీసీల, మైనారిటీల జీవితాల్లో చీకట్లు నింపిన వైసీపీ ప్రభుత్వానికి బస్సు యాత్ర చేసే నైతిక హక్కు లేదన్నారు. ముఖ్యమంత్రి పెదాల నుంచి మాత్రమే నా యస్సిలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటారని, అతని మనసులో తన సామాజిక వర్గానికి మాత్రమే చోటుంటుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అంభేడ్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతల సమావేశాలకు, ప్రజా ఉద్యమాలకు సవాలక్ష కారణాలతో అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసులకు వైసీపీ నేతలు చేస్తున్న అడ్డగోలు కార్యక్రమాలు కనపడటం లేదా అని విమర్శించారు. రాష్ట్రంలో వైసీపీ నేతలకో చట్టం, ప్రతిపక్ష నేతలకో చట్టం లేదన్న విషయాన్ని పోలీసులు గ్రహించాలని హితవు పలికారు. వైసీపీ దుర్మార్గాలను, దాష్టీకాలను, సంక్షేమం ముసుగులో చేస్తున్న ప్రజాధన దోపిడీని ప్రజలు గ్రహించారని రానున్న ఎన్నికల్లో ప్రజలు తమ ఓటుతో బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని నేరేళ్ళ సురేష్ అన్నారు.