వైసీపీ అవలంభిస్తున్న ద్వంద రాజకీయాలను ప్రజలు గమనించాలి: ఆళ్ళహరి

*ప్రజల జీవితాలతో చెలగాటమాడే వాళ్లు రైతు శ్రేయస్సులా?

*వైసీపీలో పదవులు రావాలి అంటే నేర చరిత్ర ప్రామాణికమా?

*కనీస వ్యవసాయ పరిజ్ఞానం లేని వాళ్ళు రైతు సంక్షేమ పాలకవర్గ సభ్యులా?

*గుట్కా మాఫియా నిందితుడికి వైస్ చైర్మన్ పదవితో ఆందోళనలో మిర్చి రైతులు.

*ప్రజాప్రతినిధులు చేసే అక్రమ వ్యాపారానికి కొమ్ము కాస్తే చాలు ఎలాంటి ఉన్నతస్థాయి పదవులైనా కట్టబెడతారా?

*పద్నాలుగు మంది ఉన్న పాలకవర్గంలో నాలుగు పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెడతారా? ఇదేనా వైసీపీ చెప్పే సామాజిక న్యాయం?

వైసీపీ ప్రభుత్వంలో పదవులు పొందాలి అంటే ఏదో ఒక నేరచరిత్ర కలిగిఉండటం కనీస అర్హతగా మారిందని.. ప్రజల జీవితాలను.. ఆరోగ్యాన్ని ఛిద్రం చేస్తున్న నిషేధిత గుట్కా నిందితుడికి మిర్చి యార్డ్ వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టడం దుర్మార్గమని జనసేన పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆగ్రహాం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడ్డ మిర్చి యార్డ్ పాలకమండలిలో గతంలో భారీస్థాయిలో గుట్కా నిల్వలు కలిగివున్న కేసులో నిందితుడికి వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గురువారం ఆళ్ళహరి విలేకరులతో మాట్లాడారు. ఎలాంటి నామినేటెడ్ పదవికైనా కనీస అర్హతలు ఉంటాయని అందులోనూ రైతులకు సంభందించిన పదవులు పొందాలి అంటే వ్యవసాయం పట్ల.. రైతుల జీవనవిధానం పట్ల కనీస అవగాహన ఉండాలన్నారు. తమ నాయకుడు చేస్తున్న గుట్కా వ్యాపారాలకు కొమ్ము కాయటమే తప్ప మరో వ్యాపకం లేని వ్యక్తికి ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మిర్చి యార్డ్ వైస్ చైర్మన్ పదవి ఎలా కట్టబెడతారని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. పాలకమండలిలో ఇలాంటి పరిణామాలను గమనిస్తున్న రైతుల్లో అభద్రతాభావం నెలకొందని, ఇలాంటి నేతల పాలనలో తమ భవిష్యత్ ఎలా ఉంటుందో అన్న భయాందోళనలో మిర్చి రైతులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సేవా భావం ఉన్నవారికి, సమాజం పట్ల బాధ్యత, కాస్త స్పృహ ఉన్నవారికి ఇచ్చే పదవులను ఇలా చట్టవ్యతిరేకమైన పనుల్లో నిందితులుగా ఉన్నవారికి ఇవ్వటం పట్ల ప్రజల్లో ఆగ్రహం నెలకొందన్నారు. మరోవైపు సామాజిక న్యాయ భేరీ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ కొన్ని రోజుల క్రితమే బస్సు యాత్రలు చేసిన వైసీపీ నేతలు యార్డ్ పాలకమండలిలో ఏకంగా నాలుగు పదవులు ఒకే సామాజిక వర్గానికి కట్టబెట్టడాన్ని వైసీపీ నేతలు ఏ విధంగా సమర్ధించుకుంటారన్నారు. వైసీపీ ప్రభుత్వం చెప్పే దళితుల, బీసీల, మైనారిటీల, కాపుల అభివృద్ధి అంతా నేతిబీరలో నెయ్యి చందమేనని.. అట్టడుగు వర్గాల వారికి అరకొర విదిల్చి అగ్రభాగం ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వటమేనా వైసీపీ చెప్పే సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు చెప్పేదొకటి చేసేదొకటి అని ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ద్వంద రాజకీయాలను ప్రజలు గమనించాలని ఆళ్ళహరి కోరారు.